Vishnu Kumar Raju: షర్మిల రాకతో వైసీపీ పని అయిపోయింది.. జగన్ పై జాలి కలుగుతోంది: విష్ణుకుమార్ రాజు
- వైసీపీలో ఉన్న చాలా మంది కాంగ్రెస్ నుంచి వెళ్లిన వారేనన్న విష్ణు రాజు
- వైసీపీ ఒక దిక్కుమాలిన పార్టీ అని వ్యాఖ్య
- షర్మిల వల్ల 10 శాతం వైసీపీ ఓట్లు చీలుతాయన్న విష్ణు రాజు
ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను వైఎస్ షర్మిల తీసుకోవడంతో వైసీపీ పని అయిపోయిందని.. సీఎం జగన్ పై తనకు జాలి కలుగుతోందని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు అన్నారు. వైసీపీ ఫినిష్ అయిపోయినట్టే అని అన్నారు. జగన్ పార్టీలో ఉన్న వారు చాలా మంది కాంగ్రెస్ నుంచి వెళ్లినవారేనని... ఇప్పుడు వీరిలో చాలా మంది ఆ పార్టీలో ఇబ్బందిగా ఉంటున్నారని చెప్పారు.
ఒక ఎమ్మెల్యేకు సంవత్సరం, ఒకటిన్నర సంవత్సరం నుంచి సీఎం అపాయింట్ మెంట్ లేకపోతే అదేం పార్టీ... దిక్కుమాలిన పార్టీ అని అన్నారు. ఇది చాలా అవమానంతో కూడుకున్న వ్యవహారమని... అలాంటి పార్టీలో ఎమ్మెల్యేలు ఉండటం వారికి సిగ్గుచేటని చెప్పారు. వీరిలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ వారే కనుక... రాబోయే రోజుల్లో వైసీపీ నుంచి కాంగ్రెస్ కు పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని అన్నారు. షర్మిల వల్ల వైసీపీ ఓటు బ్యాంకు కనీసం 10 శాతం చీలుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పారు.
ఏపీలో బీజేపీ - జనసేన మధ్య, జనసేన - టీడీపీ మధ్య పొత్తు ఉందని... అయితే, ఈ మూడు పార్టీలు కలవాల్సి ఉందని విష్ణు రాజు అన్నారు. ఈ మూడు పార్టీలు కలిస్తే 150 స్థానాలను గెలుచుకుంటాయని జోస్యం చెప్పారు.