Russia plane crash: ఉక్రెయిన్ సరిహద్దులో కుప్పకూలిన రష్యా విమానం.. 74 మంది మృతి

Russian Military Plane Carrying 65 Ukrainian Prisoners Of War Crashes

  • సరిహద్దు సమీపంలోని బెల్గోరాడ్‌లో కూలిన విమానం
  • విమానంలో రష్యా క్షిపణులు తరలిస్తోందంటూ ఉక్రెయిన్ ఆరోపణ
  • సొంత ఖైదీలను తరలిస్తున్న విమానాన్నే ఉక్రెయిన్ కూల్చేసిందన్న రష్యా

ఉక్రెయిన్ సరిహద్దులో ఓ రష్యా మిలిటరీ రవాణా విమానం (ఐఎల్-76) కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో విమానంలోని మొత్తం 74 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఘటనపై స్పందించిన రష్యా.. ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలను తరలిస్తున్న విమానం కూలిందని వెల్లడించింది. సరిహద్దు సమీపంలోని బెల్గోరాడ్‌లో ఈ ప్రమాదం జరిగినట్టు పేర్కొంది. ఘటన వెనక కారణాలను వెలికి తీసేందుకు ప్రత్యేక మిలిటరీ కమిషన్‌ ఘటనా స్థలానికి బయలుదేరినట్టు తెలిపింది. ఈ విమానంలో రష్యాకు పట్టుబడిన 65 మంది ఉక్రేనియన్ సైనికులు, ముగ్గురు ఎస్కార్ట్, ఆరుగురు విమాన సిబ్బంది వున్నట్టు పేర్కొంది. 

ప్రమాదానికి సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అకస్మాత్తుగా అదుపుకోల్పోయిన విమానం వేగంగా కిందకి పడిపోతున్నట్టు ఈ వీడియోల్లో కనిపించింది. ఈ క్రమంలో విమానం ఒక్కసారిగా నేలను ఢీకొనడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 

ఈ ఘటన నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్‌లు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నాయి. ప్రమాదానికి గురైన విమానంలో రష్యా క్షిపణులను తరలిస్తోందని ఉక్రెయిన్ ఆరోపించింది. ఉక్రెయిన్ ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా.. విమానంలో ఉన్నది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలేనని స్పష్టం చేసింది. ‘సొంత సైనికులు ఉన్న విమానాన్ని వారు కూల్చేశారు. మానవతా మిషన్‌లో పాలుపంచుకుంటున్న మా పైలట్లు విమానంలో ఉన్నారు’’ అని రష్యా పార్లమెంటు స్పీకర్ ఆరోపించారు. 

  • Loading...

More Telugu News