BKU: ఫిబ్రవరి 16న భారత్ బంద్.. పిలుపునిచ్చిన రైతు బీకేయూ
- పంట ఉత్పత్తులకు కనీస మద్దతుధర రావడం లేదన్న బీకేయూ నేత రాకేశ్ టికాయత్
- నిరుద్యోగం, అగ్నివీర్, పెన్షన్ పథకాలు సమస్యగా తయారయ్యాయని ఆవేదన
- సమ్మెలో వ్యాపారులు, రవాణా సంస్థలు కూడా పాల్గొనాలని విజ్ఞప్తి
పంటలకు కనీస మద్దతు ధర సహా అనేక జాతీయ సమస్యలపై ఫిబ్రవరి 16న ‘భారత్ బంద్’ నిర్వహిస్తున్నట్టు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ ప్రకటించారు. రైతు సంఘాలతోపాటు వ్యాపారులు, రవాణా సంస్థలను కూడా మద్దతు కోరినట్టు తెలిపారు.
ఈ సమ్మెలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) సహా పలు రైతు సంఘాలు పాల్గొంటాయని టికాయత్ పేర్కొన్నారు. ఆ రోజున రైతులు తమ పొలాలకు వెళ్లరని తెలిపారు. దేశానికి ఇది పెద్ద సందేశం కావాలన్నారు. బంద్ రోజున వ్యాపారులు కొనుగోళ్లు జరపవద్దని, దుకాణాలు మూసివేయాలని కోరారు.
కనీస మద్దతు ధర లేకపోవడం, నిరుద్యోగం, అగ్నివీర్ పథకం, పెన్షన్ పథకం వంటివి దేశానికి సమస్యగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమ్మెలో ఇతర సంఘాలు కూడా పాల్గొనాలని టికాయత్ కోరారు. అప్పుడు అది ఒక్క రైతు సమ్మె మాత్రమే కాబోదని తెలిపారు.