Sajjala Ramakrishna Reddy: జగన్ పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు... సజ్జల స్పందన
- ఏం ఆశించి జగన్ కోసం షర్మిల తిరిగారో చెప్పాలన్న సజ్జల
- పీసీసీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే వైసీపీపై దాడి ప్రారంభించారని విమర్శ
- షర్మిల ద్వారా చంద్రబాబు మాట్లాడిస్తున్నారని మండిపాటు
వైఎస్సార్ పాలనకు, జగన్ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ కోసం 3,200 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని ఆమె వ్యాఖ్యనించారు. కాకినాడలో ఆమె మాట్లాడుతూ జగన్ పై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తనకు అన్యాయం జరిగిందని షర్మిల అన్నారని... ఏం ఆశించి ఆమె జగన్ కోసం తిరిగారో చెప్పాలని అన్నారు. షర్మిల చేసిన ప్రతి వ్యాఖ్యకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు.
వైఎస్సార్ కూతురు, జగన్ చెల్లెలు అనే ఒకే ఒక్క కారణంతో షర్మిలకు ఏపీ బాధ్యతలను కాంగ్రెస్ హైకమాండ్ అప్పజెప్పిందని అన్నారు. బాధ్యతలను చేపట్టిన తొలి రోజు నుంచే వైసీపీపై షర్మిల దాడి చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ను తిట్టిన షర్మిల.. ఇప్పుడు అదే పార్టీలో ఎలా చేరారని ప్రశ్నించారు. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు మణిపూర్ లో క్రిస్టియన్లపై జరిగిన దాడులపై షర్మిల ఎందుకు స్పందించలేదని అన్నారు. షర్మిల ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు ఇలా మాట్లాడిస్తున్నారని చెప్పారు.
ఏపీ రాజకీయాలపై షర్మిలకు అవగాహన లేదని సజ్జల అన్నారు. జగన్ ఓదార్పు యాత్రను అణచివేసేందుకు కాంగ్రెస్ యత్నించిందని చెప్పారు. జగన్ అంతు చూడాలని కాంగ్రెస్ ప్రయత్నించిందని.. ఇది షర్మిలకు గుర్తు లేదా? అని ప్రశ్నించారు.