Red Book: రెడ్ బుక్ లో ఏముంటుంది?... నారా లోకేశ్ వివరణ

Nara Lokesh explains about Red Book

  • యువగళం పాదయాత్ర వేళ లోకేశ్ చేతిలో 'రెడ్ బుక్'
  • 'రెడ్ బుక్' అంశంలో సీఐడీ నోటీసులు
  • తాజాగా 'రెడ్ బుక్' అంశంపై ట్వీట్ చేసిన లోకేశ్ 

యువగళం పాదయాత్ర సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేతిలో కనిపించిన 'రెడ్ బుక్' తీవ్ర కలకలం రేపింది. కొందరు అధికారుల పేర్లు ఆ బుక్ లో ఉన్నాయని, టీడీపీ అధికారంలోకి వస్తే ఆ అధికారులకు మూడినట్టేనని ప్రచారంలో ఉంది. 'రెడ్ బుక్' పై ఏపీ సీఐడీ కూడా దృష్టి సారించింది. దీనిపై ఇప్పటికే నారా లోకేశ్ కు నోటీసులు కూడా పంపింది. 

ఈ నేపథ్యంలో, అసలు 'రెడ్ బుక్' లో ఏముందో లోకేశ్ స్వయంగా వివరణ ఇచ్చారు.

"అధికారులు, పోలీసులు ఎప్పుడూ సరైన పంథాలో నడుచుకోవాలన్నది టీడీపీ సిద్ధాంతం. టీడీపీ ప్రభుత్వం వచ్చాక అధికారులకు ఎలాంటి వేధింపులు ఉండవు, వారిపై చర్యలు తీసుకోం. 

అయితే గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అసాధారణ స్థాయిలో అధికార దుర్వినియోగం, వ్యవస్థలను భ్రష్టుపట్టించడం జరిగింది. ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ, పాలకపక్షం సాగిస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్న విపక్షాలను ఇబ్బంది పెట్టేందుకు, బెదిరింపులకు గురిచేసేందుకు కొందరు కళంకితులైన అధికారులు బరితెగించారు. ఇలాంటి మానవ హక్కుల ఉల్లంఘనలకు గురైన బాధితుల కష్టాలను ఈ 'రెడ్ బుక్' లో రాసుకోవడం జరిగింది. చట్టపరమైన ప్రక్రియల ద్వారా వారికి న్యాయం జరుగుతుందని దీని ద్వారా హామీ ఇస్తున్నాం. 

ఈ 'రెడ్ బుక్' లో ప్రజల సమస్యల జాబితా ఉంటుంది. చట్టాల అతిక్రమణ, అధికార దుర్వినియోగం బాధితులకు తప్పక న్యాయం జరుగుతుందన్న అంశాన్ని 'రెడ్ బుక్' గుర్తు చేస్తూ ఉంటుంది" అని నారా లోకేశ్ తన ట్వీట్ లో వివరించారు.

  • Loading...

More Telugu News