Revanth Reddy: ఇంద్రవెల్లికి వస్తున్నాను... ఇక కాసుకోండి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో రేవంత్ రెడ్డి
- తెలంగాణలో కార్యకర్తలు గెలిపించారు... ఢిల్లీలోనూ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువద్దామని పిలుపు
- ఫిబ్రవరిలో మరో రెండు హామీలు అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి
- ఇది ఇంటర్వెల్.. ఆ తర్వాత అసలు సినిమా ఉంటుందని వ్యాఖ్య
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి వస్తున్నాను... కాసుకోండి అని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు సవాలు విసిరారు. కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కార్యకర్తలు చెమటోడ్చి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని... పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించి ఢిల్లీలోనూ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువద్దామని పిలుపునిచ్చారు. నరేంద్రమోదీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలన్నారు. కార్యకర్తల కష్టం వల్లే తాను ముఖ్యమంత్రినయ్యానన్నారు. తన పదవి, హోదా కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చినవే అన్నారు.
ఫిబ్రవరిలో మరో రెండు హామీలు
అధికారంలోకి వచ్చి 50 రోజులు కూడా కాలేదని... కానీ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మన హామీలపై అసహనం వ్యక్తం చేస్తున్నాయన్నారు. హామీలపై అప్పుడే బిల్లా, రంగాలు ప్రశ్నిస్తున్నారని చురక అంటించారు. ఫిబ్రవరి నెలలో మరో రెండు హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మనం 14 స్థానాల్లో విజయం సాధించాలన్నారు. ఇక నుంచి తాను రోజు విడిచి రోజు తెలంగాణలో పర్యటిస్తానని చెప్పారు. మన పోరాటంలో ఇది ఇంటర్వెల్ మాత్రమేనని.. ఇంటర్వెల్ తర్వాత నుంచి అసలు సినిమా ఉంటుందన్నారు.
కాంగ్రెస్లో ఇందిరమ్మ ఇంట్లో ఉండే వ్యక్తిని ఎమ్మెల్యేగా చేశామన్నారు. పేదవాళ్లు, దళితులు తమ పార్టీలో ఎమ్మెల్యేలు అయ్యారన్నారు. స్వయానా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దళిత బిడ్డ అని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో మాత్రం శాండ్, ల్యాండ్, మైన్, వైన్ అక్రమాలు చేసిన వారికే పదవులు అని ఆరోపించారు. గతంలో రాహుల్ గాంధీ పాదయాత్ర వల్ల మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చామన్నారు.
కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు
రాహుల్ గాంధీ మణిపూర్ నుంచి మహారాష్ట్రకు భారత్ జోడో పాదయాత్ర చేస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రకు మోదీ, కేడీలు అడుగడుగునా గతంలో అడ్డుపడ్డారని మండిపడ్డారు. దేశం కోసం నెహ్రూ కుటుంబం త్యాగం చేసిందని వ్యాఖ్యానించారు. రాజీవ్ గాంధీ యువతను రాజకీయాల్లో ప్రోత్సహించారన్నారు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించింది కాంగ్రెస్ పార్టీయేనని... బీజేపీ నేతలు ఏం త్యాగాలు చేశారో చెప్పాలని నిలదీశారు. ఈడీ, సీబీఐ కేసులతో సోనియా గాంధీ సహా కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెట్టారని ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెట్టిందని ఆరోపించారు. రేపటి ఎన్నికల్లో.. మోదీ వేరు... కేడీ వేరు కాదని.. రూపాలు మాత్రమే వేరు అని విమర్శించారు.