KTR: ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ శ్రవణ్ కరెక్ట్ కాదా? ప్రొఫెసర్ కోదండరాం కరెక్టా?: కేటీఆర్
- కౌశిక్ రెడ్డి నియామకాన్ని గవర్నర్ ఎందుకు తప్పుపడుతున్నారని ప్రశ్న
- పార్లమెంట్ ఎన్నికల్లో సీనియర్లం ఎవరమూ పోటీ చేయమని స్పష్టీకరణ
- త్వరలో 30 వేల మంది సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశం ఉంటుందని వెల్లడి
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ శ్రవణ్ కరెక్ట్ కాదా? కానీ ప్రొఫెసర్ కోదండరాం కరెక్టా? అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. గురువారం మీడియాతో ఆయన పిచ్చాపాటిగా మాట్లాడుతూ... కౌశిక్ రెడ్డి నియామకాన్ని గవర్నర్ ఎందుకు తప్పుపడుతున్నారన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సీనియర్లం ఎవరమూ పోటీ చేయమని స్పష్టం చేశారు. 17 లోక్ సభ స్థానాల్లో పార్టీలో తీవ్రమైన పోటీ ఉందన్నారు. ఓడిపోయిన ఎమ్మెల్యేలు తిరిగి ఎంపీలుగా పోటీ చేస్తే సానుభూతి వర్కవుట్ అయి గెలుస్తామని భావిస్తున్నారని పేర్కొన్నారు.
లోక్ సభ నియోజకవర్గాలవారీగా సమావేశాలు విజయవంతమైనట్లు చెప్పారు. సన్నాహక సమావేశాల్లో కార్యకర్తలు మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారని తెలిపారు. త్వరలో 30 వేల మంది సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశం కానున్నట్లు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో 14 స్థానాల్లో ఓడిపోయామని పేర్కొన్నారు. కేసీఆర్‌పై కుట్ర పన్నేందుకు రెండు జాతీయ పార్టీలు ఏకమయ్యాయని ఆరోపించారు.
27వ తేదీ నుంచి రోజుకు 10 అసెంబ్లీ స్థానాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించేందుకు సిద్ధమైందని మండిపడ్డారు. ఫిబ్రవరి 1తో సర్పంచ్‌ల పదవీ కాలం ముగుస్తోందని... వారి పదవీ కాలం పొడిగించాలి లేదా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. సీఎం కేసీఆర్ కోలుకుంటున్నారని... ప్రస్తుతం స్టిక్ పట్టుకొని నడుస్తున్నట్లు తెలిపారు.