Chiranjeevi: ఎలా స్పందించాలో తెలియడం లేదు.. చిరంజీవి భావోద్వేగం.. వీడియో ఇదిగో!

Megastar Chiranjeevi responds after union govt announce Padma Vibhushan

  • సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన మెగాస్టార్
  • తన ఈ స్థితికి లక్షలాదిమంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణమన్న చిరంజీవి
  • తనకు దక్కిన ఈ గౌరవం వారిదేనన్న చిరు
  • భారత ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ లభించినందుకు తనకు ఎలా స్పందించాలో తెలియడం లేదంటూ మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. పద్మవిభూషణ్ పురస్కారానికి తనను ఎంపిక చేసిన తర్వాత చిరంజీవి ఎక్స్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. దీనిపై ఎలా స్పందించాలో తెలియడం లేదని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం లభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా తమ సొంత మనిషిగా, అన్నయ్యగా, బిడ్డగా భావించిన కోట్లాదిమంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబం అండదండలు, లక్షలాదిమంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేడు తాను ఈ స్థితిలో ఉన్నానని, తనకు దక్కిన ఈ గౌరవం వారిదేనని పేర్కొన్నారు. ఈ ప్రేమకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని ప్రశ్నించారు. 

తన 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై భిన్నమైన పాత్రల ద్వారా వినోదం పంచేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తూనే ఉన్నానని చిరంజీవి పేర్కొన్నారు. నిజజీవితంలోనూ అవసరమైనప్పుడు సమాజానికి తనవంతు సాయం చేస్తూనే ఉన్నానని తెలిపారు. అయితే, తనపై చూపిస్తున్న కొండంత అభిమానానికి తాను ఇస్తున్నది గోరంతేనని చెప్పుకొచ్చారు. ఈ నిజం తనకు ప్రతి క్షణం గుర్తుకు వస్తూ ప్రతిక్షణం ముందుకు నడిపిస్తూ ఉంటుందన్నారు. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొంటున్నట్టు చిరంజీవి ఆ వీడియోలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News