Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు దక్కడంపై స్పందించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan reacts to Megastar Chiranjeevi getting Padma Vibhushan award

  • ఎనలేని సంతోషాన్ని కలిగించిందన్న జనసేనాని
  • స్వయంకృషితో భారత చలనచిత్ర రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని ప్రశంస
  • అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి కూడా అభినందనలు

స్వయంకృషితో జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్న మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ పురస్కారం వరించడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు దిగ్గజ నటుడికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ జాబితాలో మెగాస్టార్ తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చేరిపోయారు. స్వయంకృషితో భారత చలన చిత్ర చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్న చిరంజీవిని పద్మవిభూషణ్ వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించిందని జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. నటనారంగంలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన అన్నయ్య తనకు వచ్చిన ప్రతి పాత్రను, సినిమాను మనసుపెట్టి చేశారని గుర్తుచేశారు. 

ఎంతో తపనతో, మనసుపెట్టి నటించారు కాబట్టే ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారని ప్రశంసించారు. అగ్రశ్రేణి కథానాయకుడిగా చిరంజీవి సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని, సామాజిక సేవా రంగంలో అన్నయ్య చిరంజీవి చేస్తున్న సేవలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయని పవన్ అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఆయన ప్రకటన విడుదల చేశారు. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి కూడా పవన్ అభినందనలు తెలిపారు.

విద్యార్థి నాయకుడి దశ నుంచి ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వెంకయ్య నాయుడు సుదీర్ఘ కాలం పాటు ప్రజా జీవితంలో కొనసాగారని పవన్ ప్రశంసించారు. కేంద్ర మంత్రిగా విశేషమైన సేవలు అందించారని అన్నారు. ఆయన వాగ్ధాటి, తెలుగు భాషపై ఉన్న పట్టు అసామాన్యమైనవని, రాజకీయ ప్రస్థానంతో పాటు స్వచ్ఛంధ సంస్థ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారని ప్రస్తావించారు. వెంకయ్య నాయుడుకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వేర్వేరు రంగాల నుంచి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైనవారికి కూడా పవన్ అభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News