Amit Shah: ఎల్లుండి తెలంగాణకు కేంద్రమంత్రి అమిత్ షా... మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బిజీ బిజీ
- ఎల్లుండి మధ్యాహ్నం 1.05 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేటకు అమిత్ షా
- మహబూబ్ నగర్‌లో జరగనున్న పార్టీ క్లస్టర్ సమావేశంలో పాల్గొననున్న కేంద్రమంత్రి
- ఆ తర్వాత కరీంనగర్ కార్యకర్తల సమావేశానికి హాజరు
- మధ్యాహ్నం 1.05 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకు తెలంగాణలో అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 28న తెలంగాణకు రానున్నారు. మరికొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశనం చేయనున్నారు. అమిత్ షా ఎల్లుండి మధ్యాహ్నం 1.05 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. తెలంగాణ బీజేపీ నాయకులు ఆయనకు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నేరుగా మహబూబ్ నగర్‌లో నిర్వహించనున్న పార్టీ క్లస్టర్ సమావేశానికి హాజరవుతారు. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ గెలుపుపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు.
అక్కడ సమావేశం పూర్తయ్యాక... హెలికాప్టర్‌లో సాయంత్రం 3.55 గంటలకు కరీంనగర్ వెళతారు. కార్యకర్తల సమావేశంలో పాల్గొని... అటు నుంచి హైదరాబాద్ బయలుదేరుతారు. సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో పార్టీ నిర్వహించే మేధావుల సమావేశానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలపై సలహాలు, సూచనలను స్వీకరిస్తారు. ఈ సమావేశం అనంతరం రాత్రి 7.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పయనమవుతారు. ఆయన తెలంగాణలో దాదాపు 7 గంటల పాటు వుంటారు.