balka suman: ముఖ్యమంత్రి ఒకటి చెబితే... మంత్రులు మరొకటి చేస్తూ అయోమయానికి గురి చేస్తున్నారు: బాల్క సుమన్

Balka Suman fires at congress government

  • రెండు నెలలు కూడా గడవకముందే కాంగ్రెస్ పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోందన్న సుమన్
  • వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అని చెప్పి కాలయాపన చేస్తున్నారని విమర్శ
  • బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్షసాధింపుతో కేసులు పెడుతున్నారని ఆరోపణ

ముఖ్యమంత్రి ఒకటి చెబితే... మంత్రులు మరొకటి చేస్తూ తెలంగాణ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. రైతుబంధు అడిగితే రైతులను చెప్పులతో కొడతారా? ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా? అని నిలదీశారు. మంచిర్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ వచ్చి రెండు నెలలు కూడా గడవకముందే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోందన్నారు. ఎలాగూ అధికారంలోకి రాలేమని ఇష్టారీతిన హామీలు ఇచ్చారన్నారు.

వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అని చెప్పి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపుతో కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తమపై దాడులు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానాలతో నీతిలేని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కోసం ఎంతటి పోరాటాలకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అవసరమైతే లాఠీ దెబ్బలు తింటామని, జైలుకు వెళ్లేందుకు కూడా వెనకాడబోమన్నారు.

  ఏం జరిగినా ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, ప్రజలు తమకు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని హితవు పలికారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో ఎన్నికల్లో గెలిచిందన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News