Jagan: నేడు భీమిలి 'సిద్ధం' సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న జగన్
- మధ్యాహ్నం 2.30 గంటలకు భారీ సభ
- వేదికతో పాటు పెద్ద ర్యాంప్ ఏర్పాటు
- కేడర్ అభిప్రాయాలను స్వయంగా తెలుసుకోనున్న జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. భీమిలి నియోజకవర్గం తగరపువలసలో 'సిద్ధం' పేరుతో భారీ బహిరంగసభను నిర్వహించబోతున్నారు. ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సభ ప్రారంభంకానుంది.
గత సభలకు భిన్నంగా ఈ సభను నిర్వహించబోతున్నారు. సభా వేదిక మాత్రమే కాకుండా... పెద్ద ర్యాంప్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ర్యాంప్ మీద నడుచుకుంటూ కార్యకర్తల్లోకి వెళ్లి, వారితో జగన్ మమేకమవుతారు. పార్టీ కేడర్ అభిప్రాయాలను స్వయంగా తెలుసుకుంటారు.
ఈ సభలో తన పాలనలో జరిగిన సంక్షేమాన్ని, అభివృద్ధిని జగన్ వివరించనున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఎలా తిప్పి కొట్టాలో కేడర్ కు తెలియజేయనున్నారు. రానున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడమే ఈ 'సిద్ధం' సభ లక్ష్యం.
ఎన్నికలకు కేడర్ ను సంసిద్ధం చేయడమే లక్ష్యంగా నిర్వహించబోతున్న 'సిద్ధం' సభలు భీమిలి సభతో ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సభలు జరగనున్నాయి. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా ఈ సభలను నిర్వహిస్తున్నారు.