Energy Drinks: ఎనర్జీ డ్రింక్ లతో మేలు కన్నా కీడే ఎక్కువ.. తాజా అధ్యయనంలో వెల్లడి!
- మానసిక సమస్యల రిస్క్ పెంచుతున్న పానీయాలు
- డిప్రెషన్ ముప్పునూ పెంచుతున్నాయన్న పరిశోధకులు
- ఎక్కువగా ఎనర్జీ డ్రింక్ లు తాగే విద్యార్థులు చదువుల్లో వెనకబడుతున్నారని వెల్లడి
- టీసైడ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
ఎదిగే పిల్లలకు ఎనర్జీ డ్రింక్ లు తాగించడం వల్ల ఉపయోగం లేకపోగా కొత్త సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతోందని తాజా పరిశోధనలో తేలింది. ఆరోగ్యం కోసం, శక్తి కోసం పిల్లలకు ఇచ్చే పానీయాలతో మేలుకన్నా కీడే ఎక్కువగా జరుగుతోందని బయటపడింది. ఎనర్జీ డ్రింకుల పేరుతో అమ్ముతున్న హై కెఫైన్ డ్రింక్ లతో యువత పలు మానసిక సమస్యలు ఎదుర్కొంటోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
యువతపై ఎనర్జీ డ్రింక్ ల ప్రభావంపై ఇంగ్లాండ్ లోని టీసైడ్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ట్రాన్స్ లేషనల్ రీసెర్చ్ తోపాటు న్యూకాజిల్ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల అధ్యయనం నిర్వహించారు. ఇందుకోసం 21 దేశాలకు చెందిన 12 లక్షల మందిపై జరిపిన పలు పరిశోధనలను నిశితంగా పరిశీలించారు. ఈ అధ్యయనంలో పలు షాకింగ్ విషయాలు బయటపడినట్లు పరిశోధక బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ అమెలియా లేక్ తెలిపారు.
ఎదుగుతున్న వయసులో శరీరానికి అవసరమయ్యే శక్తిని అందిస్తాయంటూ ఎనర్జీ డ్రింక్ ల తయారీదారులు చెబుతుంటారు.. చిన్నపిల్లలు, యువత కోసమని ప్రత్యేకంగా వీటిని తయారు చేస్తున్నారు. ఈ డ్రింక్ లతో పిల్లల పెర్ఫార్మెన్స్ పెరుగుతుందని ప్రకటనలతో ఊదరగొడుతుంటారు. ఈ ప్రకటనల ప్రభావంతోనో, పిల్లల ఆరోగ్యం కోసమనో తల్లిదండ్రులు వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఈ డ్రింక్ ల వల్ల ప్రయోజనంలేదని తమ అధ్యయనంలో తేలిందని ప్రొఫెసర్ అమెలియా చెబుతున్నారు. ఎనర్జీ డ్రింక్ లు తరచుగా తాగే పిల్లలపై జరిగిన పలు పరిశోధనలు కూడా ఇదే చెబుతున్నాయని అన్నారు.
పైపెచ్చు ఈ డ్రింకులు పిల్లల్లో మానసిక సమస్యలకు కారణమవుతున్నాయని హెచ్చరించారు. మానసిక కుంగుబాటు, ఒత్తిడి, నిద్రకు సంబంధించిన సమస్యలు, చదువులో వెనకబడడం తదితర సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రొఫెసర్ అమెలియా తెలిపారు. ఈ డ్రింక్ ల వినియోగంతో దీర్ఘకాలంలో మరిన్ని అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎనర్జీ డ్రింక్ ల అమ్మకానికి వ్యతిరేకంగా పలు స్వచ్చంద సంస్థలతో కలిసి ప్రొఫెసర్ అమెలియా పోరాడుతున్నారు. డ్రింక్ ల అమ్మకాలపై ఆంక్షలు విధించాలని బ్రిటన్ లో పలు ఆందోళనలు కూడా జరిగాయి. దీంతో ప్రభుత్వం స్పందించి పదహారేళ్లలోపు పిల్లలకు ఎనర్జీ డ్రింక్ లు అమ్మొద్దంటూ చట్టం తీసుకొచ్చింది.