KTR: కేసీఆర్ బొండిగ పిసికేస్తే అయిపోతుందని రేవంత్ రెడ్డి అంటున్నారు... ఎందుకు?: కేటీఆర్ ఆగ్రహం
- అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో క్లీన్ స్వీప్ చేశామన్న కేటీఆర్
- ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సాధించాలని సూచన
- బీజేపీని... మోదీని కొట్టడం కేసీఆర్ వంటి ప్రాంతీయ పార్టీల నేతల వల్లే సాధ్యమన్న కేటీఆర్
- ఉచిత బస్సు పథకం మంచిదే కానీ సర్వీసులు పెంచాలని సూచన
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా లేక తెల్లారితే కేసీఆర్ పైన... బీఆర్ఎస్ పైన పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మనం క్లీన్ స్వీప్ చేసి... కాంగ్రెస్, బీజేపీని ఓడగొట్టామన్నారు. దురదృష్టవశాత్తూ హైదరాబాద్ బయటి జిల్లాల్లో మాత్రం మనకు అనుకూలంగా తీర్పు రాలేదన్నారు. అయినప్పటికీ మనం చాలా చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయామన్నారు. కేసీఆర్ వంటి నాయకుడిని గెలిపించుకోలేకపోయామని చాలామంది ఇప్పుడు బాధపడుతున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఓడిపోయినప్పటికీ ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే అన్నారు. జూబ్లీహిల్స్‌లో పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అన్నారు.
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సాధించాలి
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సాధించాలనే సామెతలా... అసెంబ్లీ ఎన్నికల్లో మనం అధికారం చేజార్చుకున్నప్పటికీ... లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపించి కేసీఆర్ బలంగా ఉన్నారనే విషయాన్ని పార్లమెంట్‌కు చూపించాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో మనం అన్ని అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవలేకపోయామని గుర్తు చేశారు. కాబట్టి మనం మొదటి నుంచి ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు.
కాంగ్రెస్, బీజేపీ మనకు కొత్త పార్టీలేమీ కాదన్నారు. మోసం కాంగ్రెస్ పార్టీ నైజమన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. వంద రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని నోటికి వచ్చినట్లు చెప్పారని ఆరోపించారు. ఇప్పుడేమో ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా, సమర్థతలేక మన ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. "కాంగ్రెస్ పార్టీకి... రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఏమంటే... నిజానికి పదేళ్లలో తెలంగాణను ఎన్నో రంగాల్లో నెంబర్ వన్‌గా చేసి బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించాం" అన్నారు.
కేసీఆర్ కొనఊపిరితో ఉన్నాడు... పిసికేస్తే అయిపోతుందని రేవంత్ అంటున్నారు
నిజంగానే వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయాలన్నారు. అంతేకానీ తెల్లారిలేస్తే కేసీఆర్‌ను తిట్టడం కాదన్నారు. కేసీఆర్‌ను పట్టుకొని బొండిగ పిసికేస్తానని అంటున్నారని... కేసీఆర్ కొనఊపిరితో ఉన్నాడు.. పిసికేస్తే అయిపోతుందని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ కొట్లాడటం కాదు... బీఆర్ఎస్ చిన్నగా మిగిలింది... ఫినిష్ చేయాలని బండి సంజయ్ అంటారని... ఇవేం మాటలు అని విమర్శించారు. నేను ఒక్కటే మాట అడుగుతున్నాను... కేసీర్ బొండిగను ఎందుకు పిసికేయాలి? బీఆర్ఎస్ లేకుండా ఎందుకు చేయాలి? అని నిలదీశారు. తెలంగాణ తెచ్చినందుకా? హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినందుకా? తెలంగాణను అభివృద్ధి చేసినందుకా? అని నిలదీశారు.
మోదీని కొట్టడం కాంగ్రెస్ వల్ల కాదు
I.N.D.I.A. కూటమి పేరుతో బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తానని కాంగ్రెస్ చెప్పిందని... కానీ ఇప్పుడు కొన్ని పార్టీలు ఆ పార్టీకి దూరం జరుగుతున్నాయన్నారు. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ వల్ల కాదని తెలిసినందువల్లే బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ దూరం జరిగారన్నారు. బిహార్‌లో నితీశ్ కుమార్ కూడా దూరం జరుగుతున్నట్లుగా వార్తలు చూశానన్నారు. కేరళలో కమ్యూనిస్టులు కూడా రాహుల్ గాంధీతో పని చేయలేమని చెబుతున్నారన్నారు. కానీ బీజేపీని ఎదుర్కోవడం... మోదీని ఆపడం కాంగ్రెస్ వల్ల కాదనే విషయం ప్రజలు గుర్తించాలన్నారు. బలమైన ప్రాంతీయ పార్టీల వల్లే అది సాధ్యమవుతుందన్నారు.
ఒక కేసీఆర్ వల్ల... ఒక అరవింద్ కేజ్రీవాల్ వల్ల... ఒక పినరయి విజయన్ వల్ల మాత్రమే సాధ్యమన్నారు. ఎవరి రాష్ట్రాల్లో వారు... ప్రాంతీయ పార్టీలు గెలుచుకుంటేనే బీజేపీని ఓడించగలమన్నారు. కానీ కాంగ్రెస్ వల్ల సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ కోసం పి.విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబం జీవితాంతం పని చేస్తే ఆయనను కూడా మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ అంటనే మోసం అని ఆరోపించారు.
ఉచిత బస్సు మంచిదే కానీ..
ఉచిత బస్సు వల్ల మహిళలు పోట్లాడుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఉచిత బస్సు మంచిదే నేను కాదనడం లేదు... కానీ అందరికీ సరిపోయేలా సర్వీసులు పెంచాలని సూచించారు. ఓ వైపు మగవాళ్లేమో మేం పైసలు పెడితే సీట్లు లేవని చెబుతున్నారని... మహిళలేమో పోట్లాడుకునే పరిస్థితి వచ్చిందని బాధపడుతున్నారని... ఆటో డ్రైవర్లేమో మా పొట్ట కొడుతున్నారని బాధపడుతున్నారని విమర్శించారు. ఏదైనా పథకం పెడితే అనాలోచితంగా పెట్టడం సరికాదన్నారు. బిల్డప్ కోసం పథకాలు పెడితే వచ్చే దుష్పరిణామాలు ఇలా ఉంటాయన్నారు.