Chandrababu: ఈ ముఖ్యమంత్రి నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం: చంద్రబాబు

Chandrababu says we can not expect more than this from CM
  • ఉరవకొండలో రా కదలి రా సభ
  • ఈ ముఖ్యమంత్రికి బుద్ధి ఉందా అంటూ చంద్రబాబు ఫైర్ 
  • ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియని ముఖ్యమంత్రి అంటూ వ్యంగ్యం
  • వ్యవసాయం గురించి ఏం తెలుస్తుంది అంటూ విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లా ఉరవకొండలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో తాము 10 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను తీసుకువస్తే, దాన్ని ఈ ముఖ్యమంత్రి పక్కనబెట్టేశాడని మండిపడ్డారు. రూ.30 కోట్ల సామగ్రిని తుప్పు పట్టించాడని ఆరోపించారు. 

"ఈ ముఖ్యమంత్రికి బుద్ది ఉందా అని అడుతున్నా... రూ.30 కోట్ల ప్రజాధనం వృథా చేసిన ఈ ముఖ్యమంత్రికి అర్హత ఉందా అని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం... ఎందుకంటే ఈయన ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియని ముఖ్యమంత్రి. ఇక వ్యవసాయం గురించి ఏం తెలుస్తుంది? టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక రైతులకు మళ్లీ పాత బీమా సదుపాయం తీసుకువస్తాం. రైతులకు ఏటా రూ.20 వేలు అందిస్తాం" అని చంద్రబాబు వెల్లడించారు. 

పోయేటప్పుడు నోటిఫికేషన్ ఇస్తున్నాడు... ఎవర్ని మోసం చేస్తాడు?

ఇవాళ ఉరవకొండ సభకు యువత పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారు వైసీపీని భూస్థాపితం చేయాలని అనుకుంటున్నారు. జాబ్ క్యాలెండర్ వచ్చిందా? డీఎస్సీ ప్రకటించారా? ఆ రోజున ఏం చెప్పారు...? ఎవరికైనా ఒక్క ఉద్యోగం వచ్చిందా? ఇప్పుడు పోతున్నాడు... పోయేటప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడంట! ఎవర్ని మోసం చేస్తావు? 

నేను ఐటీ ఉద్యోగాలు ఇచ్చాను, టీచర్ ఉద్యోగాలు ఇచ్చాను. మీరిచ్చిన ఉద్యోగాలు ఏంటి... వాలంటీరు ఉద్యోగాలు. లేకపోతే ఫిష్ మార్టుల్లో, మద్యం షాపుల్లో ఉద్యోగాలు ఇచ్చారు. టీడీపీకి, వైసీపీకి ఉండే తేడా ఇదే. 

జాబు రావాలంటే బాబు రావాల్సిందే. మరి బాబు రావాలంటే మీరేం చేస్తారు? సైకిల్ ఎక్కండి... 74 రోజులు మీరు కష్టపడండి... ఆ తర్వాత మీ జీవితాల్లో వెలుగు తీసుకువచ్చే బాధ్యత నాది. మరి మీరు సిద్ధమైతే నేను కూడా సిద్ధం. మీరు పది అడుగులు వేయండి... నేను వంద అడుగులు వేస్తా. 

తమ్ముళ్లూ.... నాకు మీకంటే ఎక్కువ ఆవేశం ఉంది. వయసనేది ఒక నెంబరు మాత్రమే. మరో 20 ఏళ్లలో ఏం చేయాలని ఆలోచిస్తున్నా. 2047 నాటికి తెలుగుజాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలి. అదే నా జీవిత లక్ష్యం. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా ఆశయం. 

యువతకు ఇదే నా హామీ

ఉరవకొండ సభ నుంచి యువతకు హామీ ఇస్తున్నా. సంవత్సరానికి 4 లక్షల  ఉద్యోగాలు ఇస్తాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యతను టీడీపీ-జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. పరిశ్రమలను పెద్ద ఎత్తున తీసుకువస్తాం. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఇంటి వద్ద నుంచే ఉద్యోగాలు చేసుకునే ప్రణాళికకు శ్రీకారం చుడతా. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ బోరు కొడితే, మండల కేంద్రాల్లో వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసి అక్కడికెళ్లి పనిచేసుకునే విధానం తీసుకువస్తాను. 

ఉద్యోగాలు వచ్చే వరకు యువతకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాను. తల్లిదండ్రులపై ఆధారపడనక్కర్లేదు. మీకు అన్నగా నేనుంటా... నేరుగా మీ ఖాతాల్లోకే రూ.3 వేలు జమ చేస్తాం. ఆ బాధ్యత నాది అని యువత అందరికీ హామీ ఇస్తున్నా.
Chandrababu
Uravakonda
Raa Kadali Raa
TDP
Anantapur District
Andhra Pradesh

More Telugu News