katipalli: నా ఇంటి కూల్చివేతతోనే మొదలవ్వాలని...: రోడ్డు విస్తరణ కోసం సొంత ఇంటిని కూల్చేసిన కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
- ఎమ్మెల్యేగా గెలిచాక కామారెడ్డి రోడ్ల విస్తరణపై కాటిపల్లి దృష్టి
- రోడ్డు విస్తరణకు తన ఇల్లు అడ్డుగా వస్తుందని తెలియడంతో దగ్గరుండి కూల్చేయించిన ఎమ్మెల్యే
- నేను చేసింది గొప్ప పనో... త్యాగమో కాదన్న కాటిపల్లి వెంకటరమణారెడ్డి
- నా నుంచే మొదలయితే ప్రజలు అర్థం చేసుకుంటారన్న కాటిపల్లి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ లను ఓడించిన కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మరోసారి పతాక శీర్షికల్లో నిలిచారు. ఎన్నికల్లో గెలిచి రికార్డ్ సృష్టించిన వెంకటరమణారెడ్డి ఆ తర్వాత ఆయన మాట్లాడే విధానం కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా రోడ్డు విస్తరణ పనుల్లో అడ్డుగా వచ్చిన తన ఇంటిని కూడా కూల్చేసి ప్రజల మన్ననలు పొందారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కామారెడ్డి పట్టణంలో రోడ్ల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఈ పనులకు తన ఇల్లు అడ్డుగా వస్తున్నట్లు గుర్తించిన ఆయన వెంటనే తన ఇంటిని ఖాళీ చేసి మరోచోటుకు మారారు. ఆ తర్వాత తన ఇంటిని కూల్చేశారు. రోడ్డు విస్తరణ పనులకు మీ ఇల్లు అడ్డుగా ఉందని ఆర్ అండ్ బీ అధికారులు చెప్పడంతో తన ఇల్లు కూల్చివేతకు వెంకటరమణారెడ్డి సిద్ధమని చెప్పారు.
ఈ క్రమంలో అధికారులతో కలిసి దగ్గరుండి మరీ తన ఇంటిని కూల్చి వేయించారు. రోడ్డు విస్తరణకు పట్టణ ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రోడ్డు విస్తరణ కోసం ఈ రోజు తన ఇంటిని నేనే కూల్చేసుకున్నానని తెలిపారు. తాను చేసింది గొప్ప విషయమో... లేక త్యాగం చేశాననో తాను భావించడం లేదని... రాజు ప్రజలకు అండగా ఉండాలని... అందుకే ఓ ఎమ్మెల్యేగా రోడ్డు విస్తరణ కోసం తన ఇంటినే కూల్చేస్తే ప్రజలకు ఆదర్శంగా నిలిచినట్లవుతుందని... ప్రజలు అర్థం చేసుకుంటారని భావించానన్నారు. ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. తమ ఇంటి నుంచే మార్పు మొదలు కావాలని తన ఇంటిని కూల్చివేయించినట్లు చెప్పారు.