Bihar: బీహార్ అసెంబ్లీలో ఏ పార్టీ బలమెంత..?
- నితీశ్ రాజీనామాతో మారిన రాజకీయ సమీకరణాలు
- అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు
- 79 మంది ఎమ్మెల్యేలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీ
- బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 78, జేడీయూ ఎమ్మెల్యేలు 45 మంది
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామా బీహార్ రాజకీయ వర్గాల్లో సంచలనం రేకెత్తించింది. ఆర్జేడీతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ చీఫ్.. మరోమారు బీజేపీతో చేతులు కలపనున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఈ దిశగా ఇప్పటికే ఒప్పందం కుదిరిందని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సీట్ల పంపకాల నిర్ణయం కూడా జరిగిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీహార్ అసెంబ్లీలో ఏ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనే వివరాలు..
బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో 79 నియోజకవర్గాల్లో జెండా ఎగరేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీ నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో 78 సీట్లను గెలుచుకున్న బీజేపీ నిలిచింది. నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ అభ్యర్థులు కేవలం 45 స్థానాల్లో మాత్రమే గెలిచారు. కాంగ్రెస్ పార్టీ 19 సీట్లు దక్కించుకోగా సీపీఐ (ఎంఎల్) 12 చోట్ల, హిందుస్తానీ ఆవాం మోర్చా (సెక్యులర్) పార్టీ నాలుగు చోట్ల, సీపీఐ రెండు, సీపీఎం రెండు, ఎంఐఎం ఒక చోట గెలుపొందాయి. రాష్ట్రంలో ఒకే ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
జేడీయూ, బీజేపీ కలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చా..
బీహార్ అసెంబ్లీలో మొత్తం సీట్లు 243
ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 122
బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 78
జేడీయూ ఎమ్మెల్యేలు 45
రెండు పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య మేజిక్ ఫిగర్ కన్నా ఒక సీటు ఎక్కువే ఉంది, దీనికి తోడు హిందుస్తానీ ఆవాం మోర్చా తమకు మద్దతిస్తోందని బీజేపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు నలుగురిని కలుపుకుంటే కూటమి బలం 127కు చేరుతుంది. దీంతో మరోమారు నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎలాంటి ఢోకా లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.