Team India: హైదరాబాద్ టెస్టు: టీమిండియా టార్గెట్ 231 రన్స్... 107 పరుగులకే 5 వికెట్లు డౌన్
- ఆసక్తికరంగా తొలి టెస్టు
- రాణించిన ఇంగ్లండ్ కొత్త స్పిన్నర్ టామ్ హార్ట్ లే
- 4 వికెట్లతో టీమిండియాను కష్టాల్లోకి నెట్టిన లెఫ్టార్మ్ స్పిన్నర్
- విజయానికి 116 పరుగుల దూరంలో టీమిండియా
ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో టీమిండియా ఓటమి కోరల్లో చిక్కుకుంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 231 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో... టీమిండియా 107 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ టామ్ హార్ట్ లే 4 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 436 పరుగులు చేసి కీలక ఆధిక్యం అందుకుంది. కానీ రెండో ఇన్నింగ్స్ లో ఓలీ పోప్ (196) భారీ సెంచరీతో పుంజుకున్న ఇంగ్లండ్ 420 పరుగులు చేసింది. తద్వారా టీమిండియా ముందు 231 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.
అయితే, ఇంగ్లండ్ కొత్త స్పిన్నర్ టామ్ హార్ట్ లే అనూహ్య రీతిలో టీమిండియా పాలిట ప్రమాదకారిగా మారాడు. పిచ్ ను సద్వినియోగం చేసుకున్న హార్ట్ లే సరైన ప్రదేశాల్లో బంతులు విసురుతూ టీమిండియాను ఇబ్బందుల పాల్జేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (38), యశస్వి జైస్వాల్ (15), శుభ్ మాన్ గిల్ (0), అక్షర్ పటేల్ (17)... హార్ట్ లేకు తమ వికెట్లు అప్పగించారు.
ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్ స్కోరు 37 ఓవర్లలో 5 వికెట్లకు 115 పరుగులు. ఈ మ్యాచ్ లో గెలవాలంటే టీమిండియా ఇంకా 116 పరుగులు చేయాలి. ఆటకు నేడు నాలుగో రోజు మాత్రమే.