Jannik Sinner: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత జానిక్ సిన్నర్... రూ.26 కోట్ల ప్రైజ్ మనీ కైవసం

Jannik Sinner clinches Australian Open Grand Slam singles title

  • ఫైనల్లో మెద్వెదెవ్ ను ఓడించిన జానిక్ సిన్నర్
  • ఐదు సెట్ల పాటు జరిగిన పురుషుల సింగిల్స్ సమరం
  • తొలి రెండు సెట్లు ఓడినా... అనూహ్యరీతిలో పుంజుకున్న సిన్నర్

ఇటలీ టెన్నిస్ ఆశాకిరణం జానిక్ సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఇవాళ జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్ జానిక్ సిన్నర్ 3-6, 3-6, 6-4, 6-4, 6-3తో మూడో సీడ్ రష్యన్ ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ పై అద్భుత విజయం సాధించాడు. 

ఈ మ్యాచ్ లో తొలి రెండు సెట్లను మెద్వెదెవ్ అలవోకగా గెలిచిన తీరు చూస్తే, కాసేపట్లో అతడే మ్యాచ్ గెలుస్తాడనిపించింది. కానీ, మూడో సెట్ నుంచి కథ మారింది. జానిక్ సిన్నర్ పదునైన సర్వీసులు, కచ్చితమైన ప్లేస్ మెంట్ల, బలమైన ఫోర్ హ్యాండ్ షాట్లతో మెద్వెదెవ్ ను ముప్పుతిప్పలు పెట్టాడు. 

చూస్తుండగానే వరుసగా మూడు సెట్లు కైవసం చేసుకున్న జానిక్ సిన్నర్ తన కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచిన సిన్నర్ కు ట్రోఫీతో పాటు రూ.26 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. రన్నరప్ గా నిలిచిన మెద్వెదెవ్ కు రూ.14 కోట్లు దక్కాయి.

మహిళల డబుల్స్ చాంపియన్లుగా సీ సు వీయ్-ఎలిస్ మెర్టెన్స్ జోడీ

ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ ను తైవాన్-బెల్జియం జోడీ సు సీ వీయ్-ఎలిస్ మెర్టెన్స్ కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన ఫైనల్లో వీయ్-మెర్టెన్స్ ద్వయం 6-1, 7-5తో లాత్వియా-ఉక్రెయిన్ జంట జెలెనా ఓస్టపెంకో- ల్యుడ్మిలా కిచెనోక్ పై విజయం సాధించింది. వీయ్-మెర్టెన్స్ జోడీకి ఇది రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్. ఈ జోడీ 2021లో వింబుల్డన్ టైటిల్ కూడా గెలిచారు. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవడం ద్వారా ఈ జోడీ రూ.6.06 కోట్ల ప్రైజ్ మనీ అందుకుంది.

  • Loading...

More Telugu News