Kanna Lakshminarayana: ముప్పాళ్ల మండలంలో కన్నా లక్ష్మీనారాయణ కార్యక్రమంపై దాడి

Attack on Kanna Lakshminarayana program in Thondapi
  • తొండపిలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం
  • హాజరైన కన్నా లక్ష్మీనారాయణ
  • లైట్లు ఆపేసి దాడికి పాల్పడిన వ్యక్తులు
  • కన్నా లక్ష్మీనారాయణ పీఏ, కొందరు టీడీపీ కార్యకర్తలకు గాయాలు
టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ప్రచార కార్యక్రమంపై దాడి జరిగింది. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపిలో కన్నా లక్ష్మీనారాయణ బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ప్రాంతంలో లైట్లు ఆపేసి దాడికి పాల్పడ్డారు. 

సమీపంలో ఉన్న భవనాల పైనుంచి ఒక్కసారిగా రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో కన్నా లక్ష్మీనారాయణ పీఏ స్వామికి, పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ కార్యక్రమానికి బందోబస్తుగా వచ్చిన పోలీసులు సైతం నిస్సహాయుల్లా చూస్తూ ఉండిపోయారు. 

తొండపిలో ఇవాళ కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం, టీడీపీలో కొందరు చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొనాల్సి ఉంది. దాడి నేపథ్యంలో సదరు కార్యక్రమాలకు కన్నా హాజరుకావడంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం తొండపిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

కన్నా లక్ష్మీనారాయణ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఇది సిట్టింగ్ మంత్రి అంబటి రాంబాబు నియోజకవర్గం అని తెలిసిందే.
Kanna Lakshminarayana
Attack
Thondapi
TDP
Palnadu District

More Telugu News