Chandrababu: చంద్రబాబు నా అభిమాన హీరో: ప్రముఖ ఎమ్ఎన్‌సీ మాజీ సీఈఓ
- హైదరాబాద్‌లో జరిగిన సాహితీ వేడుకలో పాల్గొన్న ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ మాజీ సీఈఓ గురుచరణ్ దాస్
- బాబు విజన్ వల్లే నగరానికి ఐటీ కంపెనీలు వచ్చాయని వెల్లడి
- సాఫ్ట్‌వేర్, డిజిటల్ రంగంలో భారత్ ముందుండటం గర్వకారణమని వ్యాఖ్య
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన అభిమాన హీరోల్లో ఒకరని ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియా మాజీ సీఈఓ గురుచరణ్ దాస్ తెలిపారు. హైదరాబాద్‌కు ఐటీ కంపెనీల రాక వెనక ఆయన విజన్ ఉందన్నారు. ఆదివారం సాహితీ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైటెక్ సిటీలో జరుగుతున్న అభివృద్ధిపై మాట్లాడారు. ‘‘ఇది హైటెక్ సిటీ. సాంకేతిక పురోగతి గురించి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్న రోజులివి. సాఫ్ట్‌వేర్ రంగంలో, డిజిటల్ విప్లవంలో ప్రపంచంలో భారత్ ముందుంది. ఇందుకు గర్వపడుతున్నాను. చంద్రబాబు నాయుడు తన విజన్‌తో ఇక్కడికి ఐటీ కంపెనీలను తీసుకురాగలిగారు. అందుకే ఆయన నా అభిమాన హీరోల్లో ఒకరు’’ అని ఆయన తెలిపారు.
సంస్కరణల తరువాత భారత ఆర్థిక వ్యవస్థ గొప్పగా ఎదిగిందని గురుచరణ్ దాస్ అన్నారు. అదే సమయంలో ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో పడిందన్నారు. ఆర్థిక తారతమ్యాలు పెరిగినమాట కూడా వాస్తవమేనన్నారు. అయితే, ఈ సంపద ఉపాధి అవకాశాలనూ పెంచిందన్నారు. 1991 తరువాత పేదరికం తగ్గి, మధ్య తరగతి వర్గం పెరిగిందన్న ఆయన తన తదుపరి పుస్తకం ఈ అంశంపైనే ఉంటుందని చెప్పారు. తన తాజా రచన ‘ఎనదర్ స్టార్ ఆఫ్ ఫ్రీడం’పై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ వాసంతి శ్రీనివాసన్‌తో చర్చించారు. ‘ది గ్రేట్ ఫ్లాప్ ఆఫ్ 1942’ పుస్తకంపై ముకుంద్ పద్మనాభన్‌తో కూడా ముచ్చటించారు.