Venkatesh: వెంకటేశ్, రానా, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయండి: నాంపల్లి కోర్టు ఆదేశం
- తన హోటల్ ను కూల్చివేశారంటూ డెక్కన్ హోటల్ యజమాని నందకుమార్ ఫిర్యాదు
- తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందన్న నందకుమార్
- జీహెచ్ఎంసీ, పోలీసులతో కుమ్మక్కయ్యారని ఆరోపణ
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. వెంకటేశ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులైన హీరోలు రానా, అభిరామ్, సోదరుడు దగ్గుబాటి సురేశ్ బాబులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. నందకుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై కోర్టు విచారణ జరిపింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి డెక్కన్ కిచెన్ హోటల్ ను కూల్చివేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్ ను ధ్వంసం చేసి, ఫర్చిచర్ ఎత్తుకెళ్లారని తెలిపారు.
లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులతో కుమ్మక్కై వెంకటేశ్, సురేశ్ బాబు, రానా, అభిరామ్ హోటల్ ను కూల్చేయించారని చెప్పారు. 60 మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకుని హోటల్ ను ధ్వంసం చేశారని అన్నారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో వెంకటేశ్, కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.