Satya Nadella: దారుణం, ఆందోళనకరం.. డీప్ ఫేక్ కంటెంట్‌పై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల
- అమెరికన్ పాప్‌సింగర్ టేలర్ స్విఫ్ట్ డీప్ ఫేక్ దృశ్యాలు నెట్టింట వైరల్
- ఏఐ ఆధారిత మైక్రోసాఫ్ట్ ఇమేజ్ జనరేటర్‌తో వీటిని రూపొందించినట్టు వార్తలు
- ఘటనపై స్పందించిన సత్య నాదెళ్ల
- ఇలాంటి సందర్భాల్లో తక్షణ చర్యలు అవసరమని వ్యాఖ్య
అమెరికా పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ అసభ్యకర డీప్ ఫేక్ ఫొటోలు ప్రస్తుతం అగ్రరాజ్యంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఏఐ ఆధారిత మైక్రోసాఫ్ట్ ఇమేజ్ జనరేటర్‌తో వీటిని సృష్టించారన్న వార్త కూడా కలకలం రేపుతోంది. ఈ పరిణామాలపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. ఈ ట్రెండ్ దారుణమని, ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. ఇటువంటి సందర్భాల్లో వేగంగా చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆమోదయోగ్యమైన కంటెంట్ మాత్రమే ఆన్‌లైన్‌లో ఉండేలా రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ దిశగా ప్రపంచ దేశాల భద్రతా విభాగాలు, టెక్ సంస్థలు కలిసి పనిచేయాలన్నారు. అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని, చేయాల్సింది కూడా ఎంతో ఉందని తెలిపారు.
టేలర్ స్విఫ్ట్ ఫొటోలు తొలుత ఎక్స్‌లో కనిపించాయి. దీంతో, వెంటనే రంగంలోకి దిగిన కంపెనీ వాటిని తొలగించింది. ‘మా టీం ఈ అసభ్యకర కంటెంట్ మొత్తాన్ని గుర్తించి తొలగిస్తోంది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం. ఇలాంటి కంటెంట్ బయటపడ్డ వెంటనే తొలగించేలా చర్యలు తీసుకుంటున్నాం’’ అని ఎక్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఘటనపై టేలర్ స్విఫ్ట్ కూడా ఆగ్రహంగా ఉన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.