Komatireddy Venkat Reddy: రేవంత్ రెడ్డి ఆ స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగారు... ఆయన్ని గౌరవించడం నేర్చుకో: కేటీఆర్కు మంత్రి కోమటిరెడ్డి సలహా
- అధికారం చేజారినా కేటీఆర్ తన అహంకారం వీడలేదని విమర్శ
- కేటీఆర్ దొంగమాటలు చెప్పి సిరిసిల్లలో గెలిచారన్న కోమటిరెడ్డి
- రేవంత్ రెడ్డి చిటికెన వేలుకు కూడా కేటీఆర్ సరిపోడని వ్యాఖ్య
ముఖ్యమంత్రిని గౌరవించడం నేర్చుకోవాలని... రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ నుంచి సీఎం స్థాయికి ఎదిగారని గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మంత్రి కోమటిరెడ్డి సూచించారు. సోమవారం భువనగిరి నియోజకవర్గంలోని బీబీనగర్ మండలం కొండమడుగులో పలు అభివృద్ధి పనుల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధికారం చేజారినా కేటీఆర్ తన అహంకారాన్ని మాత్రం వీడటం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన భాష తీరును మార్చుకోవాలని హితవు పలికారు. కేటీఆర్ దొంగ మాటలు చెప్పి సిరిసిల్లలో గెలిచారని విమర్శలు గుప్పించారు.
కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రిని గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్ జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని... కానీ కేటీఆర్ మాత్రం తన తండ్రి కేసీఆర్ పేరుతో దొంగమాటలు చెప్పి ఎమ్మెల్యే అయ్యారని చురక అంటించారు. రేవంత్ రెడ్డి చిటికెన వేలుకు కూడా కేటీఆర్ సరిపోడన్నారు. కేటీఆర్ అహంకారం కారణంగానే నల్గొండలో కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో... ఎక్కువ సీట్లు గెలుచుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పింది చేసే పార్టీ అన్నారు. మూసీ ప్రక్షాళనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన మూడో రోజునే మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడారని... కానీ బీఆర్ఎస్ ఎప్పుడైనా మాట్లాడిందా? అని మంత్రి ప్రశ్నించారు.