Jaspreet Bumrah: బుమ్రాను మందలించిన ఐసీసీ... కారణం ఇదే!
- హైదరాబాదు టెస్టులో బుమ్రా ప్రవర్తనపై ఐసీసీ చర్యలు
- కావాలని ఇంగ్లండ్ బ్యాటర్ కు అడ్డుగా నిలబడ్డాడన్న ఐసీసీ
- లెవల్ 1 తప్పిదంగా నిర్ధారణ
- మందలింపుతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయింపు
టీమిండియా ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ మందలింపునకు గురయ్యాడు. హైదరాబాదులో ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ సందర్భంగా... ఇంగ్లండ్ సెంచరీ హీరో ఓల్లీ పోప్ పరుగు తీస్తుండగా బుమ్రా ఉద్దేశపూర్వకంగా అతడికి అడ్డుగా వెళ్లినట్టు నిర్ధారణ అయింది. బుమ్రా కావాలని అడ్డంగా నిలబడడం వల్లే ఇద్దరూ ఢీకొన్న పరిస్థితి తలెత్తిందని ఐసీసీ తేల్చింది.
ఇది ఐసీసీ నియమావళి ప్రకారం లెవల్ 1 తప్పిదంగా భావించి అధికారిక మందలింపుతో సరిపెట్టారు. అంతేకాదు, బుమ్రా ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కూడా చేరింది.
అంతర్జాతీయ క్రికెట్లో 24 నెలల వ్యవధిలో ఏ ఆటగాడి ఖాతాలో అయినా ఇలాంటి డీమెరిట్ పాయింట్ల సంఖ్య 4కి చేరితే... అతడిపై ఒక టెస్టు నిషేధం, లేదా రెండు వన్డేల నిషేధం విధిస్తారు.