Jaishankar: ప్రధాన పర్యాటక కేంద్రంగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ... ప్రధాని మోదీపై జైశంకర్ ప్రశంసలు
- ఏక్తానగర్‌లో నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసిన టాటా గ్రూప్‌నకు చెందిన IHCL
- నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి జైశంకర్
- మోదీ విజన్ వల్ల ప్రధాన పర్యాటక కేంద్రంగా మారిందన్న జైశంకర్
- సమీపంలోని గిరిజన యువతకు ఆతిథ్య రంగంలో ఉద్యోగాలు వస్తున్నాయన్న కేంద్రమంత్రి
నరేంద్ర మోదీ విజన్ వల్ల గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రధాన పర్యాటక కేంద్రంగా మారిందని... దీంతో స్థానిక గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తున్నాయని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. నర్మదా జిల్లాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలోని ఏక్తానగర్‌లో స్థానిక గిరిజన యువకులకు ఆతిథ్య రంగంలో శిక్షణ ఇచ్చే నైపుణ్య కేంద్రాన్ని జైశంకర్ ప్రారంభించారు. ఈ నైపుణ్య కేంద్రాన్ని టాటా గ్రూప్‌నకు చెందిన IHCL ఏర్పాటు చేసింది. ఈ హాస్పిటాలిటీ స్కిల్ సెంటర్‌లో ప్రతి ఏటా 120 మంది గిరిజన యువకులు శిక్షణ పొందుతారు. ఇది ఏక్తానగర్‌లో ప్రారంభించిన రెండో నైపుణ్యాభివృద్ధి కేంద్రం.
గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో IHCL హాస్పిటాలిటీ స్కిల్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని... స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా మారిందని జైశంకర్ అన్నారు. క్రమంగా రద్దీ పెరుగుతోందని... దీంతో హోటళ్లు... ఇతర సదుపాయాలు పెరుగుతున్నట్లు తెలిపారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం వల్ల ఈ ప్రాంతానికి చెందిన ఈ యువతకు ఎన్నో కొత్త అవకాశాలు లభించాయన్నారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి పెరుగుతోన్న ప్రజాదరణ నేపథ్యంలో యువతకు ఆతిథ్య రంగంలో శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
తాను గుజరాత్ నుంచి రాజ్యసభ ఎంపీ అయినప్పుడు, నర్మదా జిల్లాను సందర్శించాలని ప్రధాని సూచించారని గుర్తు చేసుకున్నారు. ఈ ఐదేళ్ల కాలంలో నర్మదా జిల్లా అభివృద్ధి తనను ఆకట్టుకుందన్నారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరలోని అనేక గిరిజన కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించిందన్నారు. ఇది ప్రముఖ పర్యాటక ప్రదేశంగా మారడంతో హోటల్ పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ తరుణంలో గిరిజన యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఉపయోగకరమన్నారు. కాగా, గుజరాత్ నుంచి రాజ్యసభకు వెళ్లిన జైశంకర్ 'సన్సద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద' గిరిజనులు అధికంగా ఉండే నర్మదా జిల్లాలో నాలుగు గ్రామాలను దత్తత తీసుకున్నారు.