abvp: ఏబీవీపీ నాయకురాలి పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన... జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు
- జుట్టు పట్టుకోవడంతో కిందపడిన ఏబీవీపీ నాయకురాలు
- సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్
- ఘటనపై వివరణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు
జయశంకర్ యూనివర్సిటీ వద్ద ఏబీవీపీ నాయకురాలి పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ ఘటనపై వివరణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇద్దరు కానిస్టేబుళ్లు అత్యుత్సాహం ప్రదర్శించి వాహనంపై వెళుతూ ఏబీవీపీ నాయకురాలి జుట్టు పట్టుకోవడంతో కిందపడిపోయిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనలో బాధితురాలైన ఏబీవీపీ నాయకురాలి ఆరోగ్య పరిస్థితి సహా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో నివేదికను అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు ఇచ్చింది. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
అసలేం జరిగింది?
హైకోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీకి చెందిన భూమిని కేటాయించింది. దీనిని వ్యతిరేకిస్తూ ఈ నెల 25న విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనకు బీజేపీ మద్దతు పలికింది. ఈ క్రమంలో ఏబీవీపీ నాయకులు యూనివర్సిటీకి వెళ్లారు. ఈ క్రమంలో ఓ నాయకురాలి పట్ల కానిస్టేబుళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు.