gutta sukhender reddy: ఎమ్మెల్సీగా కోదండరాం ప్రమాణస్వీకారం ఇష్యూపై స్పందించిన గుత్తా సుఖేందర్ రెడ్డి

gutta sukender reddy clarifies about kodandaram and amir Alikhan issue

  • కోదండరాం, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయడానికి వస్తే చైర్మన్ లేరని ప్రచారం
  • వారు తనకు సమాచారం ఇవ్వకుండా వచ్చారని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టీకరణ
  • తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకార అంశంపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారం స్పందించారు. వీరిద్దరు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయడానికి వస్తే మండలి చైర్మన్ లేరని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ప్రచారంపై గుత్తా వివరణ ఇచ్చారు.

ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికైన మహేశ్ కుమార్ గౌడ్ మాత్రమే ప్రమాణ స్వీకారానికి సమయం ఇవ్వాల్సిందిగా తనను అడిగారని... ఈ నెల 31న మధ్యాహ్నం మూడున్నర గంటలకు వస్తానని చెబితే తాను అంగీకరించానని తెలిపారు. అదేరోజు మిగతా ఎమ్మెల్సీతోనూ ప్రమాణం చేయించేలా ఏర్పాట్లు చేయాలని తాను అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కానీ ఈ రోజు కోదండరాం, అమీర్ అలీఖాన్ సమాచారం ఇవ్వకుండానే ప్రమాణం కోసమంటూ తన కార్యాలయానికి వచ్చారని పేర్కొన్నారు.

మండలి చైర్మన్‌గా తాను నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. మీడియా తొందరపడి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని కోరారు. ఈ నెల 25వ తేదీ నుంచి తాను గొంతు నొప్పి, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నానన్నారు. వైద్యుల సూచనతో ఆ రోజు నుంచి తాను ఏ కార్యక్రమంలో పాల్గొనలేదని తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు కూడా హాజరు కాలేదని తెలిపారు.  27, 28, 29 తేదీలలో ముంబైలో జరుగుతోన్న ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌కు కూడా వెళ్లలేదన్నారు.

అయితే ఎమ్మెల్సీగా ప్రమాణం చేసేందుకు మహేశ్ కుమార్ గౌడ్ మాత్రం సమయం అడిగారని... ఆయన ఈ నెల 31న మధ్యాహ్నం ప్రమాణం చేస్తారని తెలిపారు. కానీ గవర్నర్ కోటా కింద నియమితులైన ఎమ్మెల్సీలు తనకు సమాచారం ఇవ్వకుండా తన కార్యాలయానికి వచ్చారని తెలిపారు.

  • Loading...

More Telugu News