Rajinikanth: ‘సంఘీ’ వ్యాఖ్యలపై కుమార్తె ఐశ్వర్యను సమర్థించిన రజనీకాంత్
- ఐశ్వర్యపై హిందూ సంఘాల మండిపాటు
- ‘సంఘీ’ పదాన్ని తప్పుగా అభివర్ణించలేదన్న సూపర్ స్టార్
- తన తండ్రి అన్ని మతాలను ప్రేమించే ఆధ్యాత్మిక వ్యక్తి అని మాత్రమే చెప్పిందని సమర్థన
సినిమా ప్రమోషన్ కోసం ‘సంఘీ’ పదాన్ని ఉపయోగించారంటూ తమిళ డైరెక్టర్, ప్లేబ్యాక్ సింగర్ ఐశ్వర్యపై హిందూ సంఘాలు మండిపడుతున్న వేళ సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పందించారు. తన కుమార్తె ఐశ్వర్య ‘సంఘీ'ని చెడు పదంగా అభివర్ణించలేదని, నాన్న ఆధ్యాత్మిక వ్యక్తి అని మాత్రమే ఆమె చెప్పిందని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాన్న అన్ని మతాలను ప్రేమించే ఆధ్యాత్మిక వ్యక్తిగా పేర్కొందని, అందుకే తండ్రిని అలా (సంఘీ) అభివర్ణించిందని రజనీకాంత్ సమర్థించారు. ఐశ్వర్య దర్శకత్వం వహించిన ‘లాల్ సలామ్’ మూవీ ప్రమోషన్ కోసం ఆమె ఈ విషయంపై మాట్లాడిందన్న ఆరోపణలను రజనీకాంత్ కొట్టిపారేశారు. అలాంటిదేమీ లేదని అన్నారు.
‘రైట్ వింగ్’ (మితవాద) మద్దతుదారుడు లేదా కార్యకర్త గురించి చెప్పడానికి ‘సంఘీ’ వ్యవహరిక పదంగా ఉంది. ఈ పదాన్ని సినిమా ప్రమోషన్ కోసం వాడారంటూ ఐశ్వర్యపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పదంపై ఐశ్వర్య మాట్లాడారంటూ పలు రిపోర్టులు వెలువడడంతో చర్చనీయాంశమయ్యాయి. కాగా ఐశ్వర్య దర్శకత్వం వహించిన ‘లాల్ సలామ్’ మూవీ ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ఈ సినిమాలో రజనీకాంత్ కూడా నటించారు.