Nitish Kumar: రాహుల్ గాంధీపై కోపంతో ఇండియా కూటమి నుంచి బయటకి వెళ్లాలని నితీశ్ నిర్ణయం!.. జనవరి 13న ఏం జరిగింది?

Nitish Kumars decision to go out of Indias alliance out of anger at Rahul Gandhi saying reports
  • జనవరి 13న ఇండియా కూటమి వీడియో కాన్ఫరెన్స్‌లో రాహుల్ గాంధీపై నితీశ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారంటున్న రిపోర్టులు
  • కూటమి కోఆర్డినేటర్ పదవిపై మమతా బెనర్జీతో మాట్లాడతానంటూ రాహుల్ చెప్పడమే నితీశ్ ఆగ్రహానికి కారణం
  • 10 నిమిషాల ముందుగానే మీటింగ్ నుంచి నితీశ్ నిష్క్రమణ
  • ఇండియా కూటమి నుంచి వైదొలగాలని అదే రోజు నిర్ణయం తీసుకున్నారంటున్న సంబంధిత వర్గాలు
విపక్షాల ఇండియా కూటమి జనవరి 13న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో రాహుల్ గాంధీపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని, కూటమి నుంచి వైదొలగాలని అదే రోజున ఆయన నిర్ణయించుకున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ గాంధీపై కోపంతో నితీశ్ కుమార్ 10 నిమిషాల ముందుగానే మీటింగ్ నుంచి నిష్ర్కమించారని పేర్కొన్నాయి. ఇండియా కూటమి కోఆర్డినేటర్ పదవిపై మమతా బెనర్జీని సంప్రదిస్తానంటూ రాహుల్ గాంధీ అనడమే నితీశ్ కుమార్ ఆగ్రహానికి కారణమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కొద్దిసేపటికే కూటమి కన్వీనర్‌గా నితీశ్ కుమార్‌ను ఎన్నుకున్నప్పటికీ ఆయన కోపం చల్లారలేదని, ఆఫర్‌ను నితీశ్ తిరస్కరించారని, ఆ పదవిని లాలూ యాదవ్‌కు ఇవ్వొచ్చని ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. 

కాగా కూటమి చైర్మన్‌గా, కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జునఖర్గే పేరును ప్రతిపాదించినప్పుడు కూడా నితీశ్ అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. గతంలో జరిగిన కూటమి సమావేశంలో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ మల్లికార్జున్ ఖర్గే పేరును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. నితీశ్ కుమార్ ఆశించిన ప్రధానమంత్రి పదవికి ఇతరుల పేర్లను ప్రతిపాదించడం ఆయనకు రుచించలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
Nitish Kumar
Rahul Gandhi
Bihar
JDU
Bihar politics

More Telugu News