CM Jagan: ఇవాళ కూడా పెద్ద సంఖ్యలో తాడేపల్లి సీఎంవోకు తరలివచ్చిన వైసీపీ సిట్టింగ్ ప్రజాప్రతినిధులు
- ఏపీలో అధికారం నిలబెట్టుకునేందుకు సీఎం జగన్ తీవ్ర కసరత్తులు
- కొనసాగుతున్న వైసీపీ ఇన్చార్జిల మార్పు ప్రక్రియ
- పలువురు మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎంవో నుంచి పిలుపు
ఏపీలో అధికారం నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉన్న సీఎం జగన్ పలు పార్లమెంటు, అసెంబ్లీ ఇన్చార్జిల మార్పులపై తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. మరో రెండు, మూడ్రోజుల్లో వైసీపీ ఐదో జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, సీఎం క్యాంపు కార్యాలయం నుంచి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, నేతలకు పిలుపు అందింది. సీఎంవోకు వచ్చిన వారిలో మంత్రులు గుడివాడ అమర్నాథ్, ఉషశ్రీ చరణ్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్, ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు సీఎంవోకు వచ్చిన వారిలో ఉన్నారు.
సీఎంవో నుంచి పిలుపు మేరకు వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు భారీగా తరలివచ్చారు. ఇన్చార్జిల మార్పులపై సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.