Divya Deshmukh: ప్రేక్షకుల తీరు ఇబ్బందికరంగా ఉంటోంది: చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్ ముఖ్
- నెదర్లాండ్స్ లో టాటా స్టీల్ చెస్ టోర్నీలో పాల్గొన్న దివ్య దేశ్ ముఖ్
- ప్రేక్షకులకు క్రీడాకారిణులు అంటే చులకన భావం అని వెల్లడి
- క్రీడాకారిణుల దుస్తులు, కట్టుబొట్టు, యాసపైనే వారి దృష్టి ఉంటుందని వివరణ
భారత చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్ ముఖ్ ఇటీవల నెదర్లాండ్స్ లో నిర్వహించిన టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టోర్నీలో పాల్గొంది. ఈ టోర్నీలో తాను ప్రేక్షకుల తీరుతో ఇబ్బందిపడినట్టు దివ్య దేశ్ ముఖ్ వెల్లడించింది.
దివ్య స్వస్థలం మహారాష్ట్రలోని నాగ్ పూర్. 18 ఏళ్ల దివ్య ప్రస్తుతం చెస్ లో ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాతో కొనసాగుతోంది. గతేడాది ఆసియా మహిళల చెస్ చాంపియన్ షిప్ విజేతగా నిలిచింది. అయితే కొన్నిరోజుల కిందట నెదర్లాండ్స్ లోని విక్ ఆన్ జీ నగరంలో జరిగిన చెస్ టోర్నీలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను దివ్య దేశ్ ముఖ్ సోషల్ మీడియా పోస్టు రూపంలో అందరితో పంచుకుంది.
చెస్ లో క్రీడాకారిణులు అంటే ప్రేక్షకులకు చులకన భావం ఉందని విమర్శించింది. పురుషులు చెస్ ఆడుతుంటే ప్రేక్షకులు వారి నైపుణ్యం గురించి మాట్లాడుకుంటారని, కానీ, మహిళలు చెస్ ఆడుతుంటే ప్రేక్షకుల దృష్టి అంతా ఆ క్రీడాకారిణులు ధరించిన దుస్తులు, ఆమె కట్టుబొట్టు, యాస... ఇలాంటి అనవసర విషయాలపైనే ఉంటుందని దివ్య ఆవేదన వ్యక్తం చేసింది. ఎందుకిలా పురుషులు, మహిళలు అంటూ వేరు చేసి చూస్తారు? అని ప్రశ్నించింది.
ఈ అంశాల గురించి ఎప్పట్నించో మాట్లాడాలనుకుంటున్నానని, ఇప్పుడు సమయం వచ్చిందని వివరించింది. అంతేకాదు, తాను ఏ మీడియా ఇంటర్వ్యూకైనా హాజరైనా ఇదే పరిస్థితి అని, ఆట గురించి వదిలేసి, ఇతర విషయాలే ప్రస్తావనకు వస్తుంటాయని అసహనం వ్యక్తం చేసింది.
ఒక్క చెస్ లోనే కాదని, మహిళలు తమ దైనందిన జీవితంలో ఇలాంటివి రోజూ ఎదుర్కొంటూనే ఉంటారని పేర్కొంది. మహిళలకు ఇకనైనా సమాన గౌరవం ఇవ్వడం మొదలుపెట్టాలని భావిస్తున్నానని దివ్య దేశ్ ముఖ్ తన పోస్టులో పేర్కొంది.