Tejashwi Yadav: తేజస్వి యాదవ్ కు 60 ప్రశ్నలను సంధించిన ఈడీ అధికారులు
- ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ లో తేజస్విని విచారించిన ఈడీ
- ఉదయం 11.35 గంటలకు పాట్నాలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న తేజస్వి
- ఈడీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న ఆర్జేడీ శ్రేణులు
ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ లో ఆర్జేడీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ను ఈడీ అధికారులు విచారించారు. ఈ ఉదయం 11.35 గంటలకు బీహార్ రాజధాని పాట్నాలోని ఈడీ కార్యాలయానికి తేజస్వి చేరుకున్నారు. దాదాపు 60 ప్రశ్నలను ఆయనకు ఈడీ అధికారులు సంధించారు. ఆయనను ప్రశ్నిస్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో ఆర్జేడీ మద్దతుదారులు ఈడీ కార్యాలయం ఎదుట వేచి ఉన్నారు.
ఈ సందర్భంగా ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝా మాట్లాడుతూ... తేజస్వి యాదవ్, ఆయన కుటుంబ సభ్యులను ఈడీ ప్రశ్నిస్తుండటంపై మండిపడ్డారు. ఇది ఈడీ కార్యాలయం కాదని... ఇది బీజేపీ కార్యాలయమని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రతిపక్ష పార్టీల నేతలకు ఈడీ సమన్లు వస్తుంటాయని దుయ్యబట్టారు. ఇదే సమయంలో ఎన్డీయే భాగస్వామి, హిందుస్థానీ ఆవామ్ మోర్చా నేత జితిన్ రామ్ మాంజీ మాట్లాడుతూ... అక్రమంగా సంపాదించిన వారంతా ప్రధాని మోదీ హయాంలో జైలుకు వెళ్లాల్సిందేనని చెప్పారు.