AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నిర్ణయం
- పలు కీలక విషయాలను చర్చించనున్న కేబినెట్
- ఉచిత బస్సు ప్రయాణంతో ప్రభుత్వంపై ఏటా రూ.1,440 కోట్ల భారం
- డీఎస్సీ నోటిఫికేషన్ జారీపైనా చర్చ
- ఎన్నికలే లక్ష్యంగా ప్రజలకు తాయిలాలు ప్రకటించే అవకాశం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలపై ప్రకటన ఉండే అవకాశం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందులో ఒకటి. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ప్రభుత్వంపై పడే ఆర్థిక భారానికి సంబంధించిన నివేదికను ఆర్థికశాఖ ఇప్పటికే ప్రభుత్వానికి అందించింది. ప్రస్తుతం ఇదే పథకాన్ని కర్ణాటక, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వంపై ఏటా రూ. 1,440 కోట్ల భారం పడుతుంది. ఈ పథకం కారణంగా మహిళా ఓటర్లు వైసీపీ వైపు మొగ్గే అవకాశం ఉందని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న వేళ డీఎస్సీ నోటిఫికేషన్‌పైనా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఇది ప్రతిబంధకంగా మారే అవకాశం ఉండడంతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసే అంశంపై సమావేశంలో చర్చించనున్నారు. వీటితోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర ఉపశమనం, మెగాహౌసింగ్, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు, రైతు భరోసా, సున్నా వడ్డీ, ఇన్‌పుట్ సబ్సిడీ, పంట బీమా, వ్యవసాయ రుణమాఫీ వంటి పథకాలపైనా చర్చించే అవకాశం ఉంది.