Modi Statue: 190 అడుగుల ఎత్తుతో మోదీ విగ్రహం.. రూ. 200 కోట్లతో నిర్మించనున్న అస్సామీ వ్యాపారవేత్త
- పీఠం ఎత్తు 60 అడుగులతో కలిపి మొత్తంగా 250 అడుగుల మోదీ విగ్రహం
- సొంత స్థలంలో నిర్మించనున్న వ్యాపారవేత్త నబీన్ చంద్రబోరా
- పూర్తి వివరాలను పీఎంవోకు పంపిన నబీన్
- గ్రీన్ సిగ్నల్ రావడంతో సోమవారం ప్రారంభమైన భూమిపూజ
- విగ్రహాన్ని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించే యోచన
ప్రస్తుతం దేశంలో విగ్రహాల హవా నడుస్తోంది. రోజుకోచోట అత్యంత ఎత్తయిన విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు. తాజాగా అసోంలోని గువాహటికి చెందిన వ్యాపారవేత్త నబీన్ చంద్రబోరా అత్యంత ఎత్తయిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంస్య విగ్రహాన్ని నిర్మించతలపెట్టారు.
గువాహటిలోని జలుక్‌బరి ప్రాంతంలోని ప్రధాన బస్టాండ్ సమీపంలో బోరాకు ఉన్న సొంత స్థలంలో ఈ విగ్రహాన్ని నిర్మించనున్నారు. మూడు రోజులపాటు జరిగే భూమి పూజ కార్యక్రమం కూడా సోమవారం ప్రారంభమైంది. 60 అడుగుల పీఠం, 190 అడుగుల విగ్రహం కలిసి మొత్తం 250 అడుగుల ఎత్తులో నిర్మించనున్న ఈ విగ్రహం కోసం దాదాపు రూ. 200 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు బోరా తెలిపారు.
కాంస్య విగ్రహానికి సంబంధించి డిజైన్ కూడా ఇప్పటికే ఖరారైంది. విగ్రహం మెడపై అస్సామీ సంస్కృతికి చిహ్నమైన గామోసా ఉంటుందని బోరా పేర్కొన్నారు. తాను నిర్మించబోయే విగ్రహానికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయానికి బోరా పూర్తి వివరాలతో సమాచారం అందించారు. ప్రపంచంలోని అత్యుత్తమ ప్రధానులలో మోదీ ఒకరని, ఆయన విగ్రహాన్ని నెలకొల్పే అవకాశం రావడం తన అదృష్టమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ విగ్రహాన్ని ప్రధాని మోదీతోనే ఆవిష్కరింపజేయాలని ఆయన యోచిస్తున్నారు.