Drug Case: సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ జల్సాల బాట.. డ్రగ్స్‌తో చిక్కిన లఘుచిత్రాల నటి
- 15 ఏళ్ల క్రితం విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన లావణ్య
- సినిమాల్లో అవకాశాల కోసం యత్నిస్తూ లఘు చిత్రాల్లో నటిస్తున్న వైనం
- స్నేహితుడితో కలిసి డ్రగ్స్ విక్రయం
- గతేడాది మోకిల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
- అప్పటి నుంచి పరారీలోనే
- తాజాగా డ్రగ్స్ విక్రయించే ప్రయత్నంలో పట్టుబడిన వైనం
లఘు చిత్రాల్లో నటిస్తూ జల్సాలకు అలవాటుపడిన విజయవాడకు చెందిన యువతి హైదరాబాద్‌లో డ్రగ్స్‌తో పట్టుబడింది. 15 ఏళ్ల క్రితం విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన మన్నేపల్లి లావణ్య (32) హోటల్ మేనేజ్‌మెంట్ కోర్స్ పూర్తిచేసి కోకాపేటలో సోదరుడితో కలిసి ఉంటోంది. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ లఘు చిత్రాల్లో నటిస్తున్న ఆమెకు స్నేహితుడు శేఖర్‌రెడ్డి ద్వారా నార్సింగ్‌కు చెందిన ఉనీత్‌రెడ్డితో పరిచయమైంది.
2014లో ఇద్దరూ కలిసి ‘దేవదాసుకు పెళ్లైంది’ అనే లఘుచిత్రంలో నటించారు. అప్పటికే డ్రగ్స్‌కు అలవాటు పడిన ఉనీత్‌పై 2022లో గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బెంగళూరులో రూ. 1500 చొప్పున గ్రాము ఎండీఎంఏ డ్రగ్‌ను కొనుగోలు చేసి హైదరాబాద్‌లో రూ. 6 వేలకు విక్రయించేవాడు. ప్రియురాలు ఇందిర అలియాస్ ఇందు, లావణ్యతో కలిసి డ్రగ్స్ తీసుకునే వాడు. ఈ క్రమంలో వారిని కూడా డ్రగ్స్ సరఫరాకు వినియోగించుకునేవాడు. గతేడాది ఆగస్టులో సైబరాబాద్‌లోని మోకిలలో ఉనీత్‌పై కేసు నమోదైంది. ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న లావణ్య పరారైంది.
లావణ్య తాజాగా ఈ నెల 28న ఉనీత్, ఇందు నుంచి 5 గ్రాముల డ్రగ్ తీసుకుని అందులో గ్రాము తను వినియోగించుకుని మిగతా నాలుగు గ్రాములను విక్రయించాలని నిర్ణయించింది. పక్కా సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్‌వోటీ, నార్సింగి పోలీసులు కోకాపేటలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఉనీత్‌రెడ్డి, ఇందు పరారీలో ఉన్నారు. నిందితురాలు తరచూ విదేశాలకు వెళ్తోందని, అరెస్టు చేయకుంటే పారిపోయే ప్రమాదం ఉందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. త్వరలోనే ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నట్టు తెలిపారు.