Chandrababu: ఏపీలో పోలీసు వ్యవస్థ పతనం.. డీజీపీ తక్షణమే వీఆర్ఎస్ తీసుకోవాలి: మండిపడ్డ చంద్రబాబు
- ఏపీలో పాలనా వ్యవస్థ నిర్వీర్యమై జగన్ గూండారాజ్ నడుస్తోందని ఆగ్రహం
- మార్టూరు, క్రోసూరు ఘటనల వెనుక పోలీసుల సహకారం ఉందని ఆరోపణ
- రాష్ట్ర ప్రభుత్వ గౌరవాన్ని దిగజార్చిన ఘటనలపై స్పందించని డీజీపీ ఎందుకని ప్రశ్న
- పోలీసు వ్యవస్థ కళ్లముందే పతనం అవుతున్నా డీజీపీ కట్టడి చేయట్లేదని మండిపాటు
రాష్ట్రంలో పోలీసు శాఖ పతనమవుతున్నా కట్టడి చేయలేని డీజీపీ తక్షణమే స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏపీలో పాలనా వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమై, ఊరూరా జగన్ గూండారాజ్యం మాత్రమే నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్టూరులో మారణాయుధాలతో మైనింగ్ తనిఖీలు, క్రోసూరులో రౌడీ మూకల విధ్వంసానికి పోలీసుల సహకారం గాడితప్పిన పాలనకు నిదర్శనమని అన్నారు. మార్టూరులో మారణాయుధాలతో గ్రానైట్ పరిశ్రమల్లో తనిఖీల పేరిట చేసిన అరాచకం వ్యవస్థల విధ్వంసం కాదా? అని దుయ్యబట్టారు. మైనింగ్ శాఖలో ఒక ఏడీ స్థాయి అధికారి రౌడీలతో తనిఖీలకు వచ్చిన ఘటన రాష్ట్రంలో గూండారాజ్కు ఉదాహరణగా నిలుస్తోందని మండిపడ్డారు.
క్రోసూరులో ఎమ్మెల్యే కుమారుడు వందల మందితో ప్రజల ఆస్తులపై దాడికి దిగితే చర్యలు తీసుకోకపోగా, పోలీసులు సహకరించారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర పోలీసు శాఖ గౌరవాన్ని దిగజార్చిన ఘటనలపై స్పందించని డీజీపీ ఎందుకని ప్రశ్నించారు. ఒకప్పుడు దేశం కీర్తించిన రాష్ట్ర పోలీసు శాఖ కళ్ల ముందే పతనం అవుతుంటే కట్టడి చేయలేని డీజీపీ తక్షణమే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని అన్నారు. కింది స్థాయి అధికారులు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన జిల్లా ఎస్పీలు అరాచకాలకు కొమ్ముకాస్తున్నారని దుయ్యబట్టారు. చట్టాన్ని అమలు చేయలేని ఆయా జిల్లాల ఎస్పీలు ఖాకీ యూనిఫాం తీసేసి వైసీపీ జెండానే యూనిఫాంగా కుట్టించుకోవాలన్నారు. ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటున్న అధికారులు చట్టానికి కట్టుబడి పనిచేయాలని సూచించారు. తప్పు చేసిన అధికారులను న్యాయస్థానాలు తప్పక శిక్షిస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు.