Rahul Gandhi: బెంగాల్ లో రాహుల్ గాంధీ కారుపై రాళ్ల దాడి అంటూ వార్తలు... అసలు విషయం ఇదే!
- పశ్చిమ బెంగాల్ లోకి ప్రవేశించిన భారత్ జోడో న్యాయ్ యాత్ర
- మాల్దా జిల్లాలో రాహుల్ కారు అద్దం పగిలిపోయిన వైనం
- రాళ్ల దాడి అంటూ ఆరోపించిన అధిర్ రంజన్ చౌదరి
- మహిళ అడ్డం వస్తే బ్రేక్ వేయడంతో అద్దం పగిలిందని కాంగ్రెస్ నాయకత్వం వివరణ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కారుపై నేడు రాళ్ల దాడి జరిగిందని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. అయితే కాసేపటికే కాంగ్రెస్ ఆ వార్తపై క్లారిటీ ఇచ్చింది. అది తప్పుడు వార్త అని పేర్కొంది.
అసలేం జరిగిందంటే... రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమ బెంగాల్ లో ప్రవేశించింది. మాల్దా జిల్లాలో యాత్ర కొనసాగుతుండగా, రాహుల్ గాంధీ కారు అద్దం పగిలిపోయింది. రాళ్లు విసిరిన కారణంగానే కారు అద్దం పగిలిపోయి ఉంటుందని బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. కారు అద్దం పగిలిన సమయంలో రాహుల్ కారులో లేరు. ఓపెన్ టాప్ వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇక, దాడి అంటూ వస్తున్న వార్తలపై కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. రాహుల్ కాన్వాయ్ కు ఓ మహిళ అడ్డంగా రావడంతో కారుకు బ్రేక్ వేశారని, ఆ ఒత్తిడి కారణంగా కారు విండ్ షీల్డ్ పగిలిపోయిందని స్పష్టం చేసింది. అందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వమే కారణమని ఆరోపించింది.
అయితే, రాహుల్ యాత్రకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తగినంత భద్రత కల్పించలేదని, ఆయన కాన్వాయ్ లోకి మహిళ చొరబడడం భద్రతా వైఫల్యమేనని కాంగ్రెస్ నాయకత్వం విమర్శించింది. మాల్దా జిల్లాలో సీఎం మమతా బెనర్జీ పర్యటిస్తుండడంతో పోలీసు శాఖ ఆమె పర్యటనపైనే దృష్టి పెట్టి, రాహుల్ యాత్రను పట్టించుకోలేదని ఆరోపించింది.
కాంగ్రెస్ అధినాయకత్వం ప్రకటన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి కూడా మాట మార్చేశారు. కారు అద్దం పగిలిందో, పగలగొట్టారో తనకు తెలియదని అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తమకు సహకరించడంలేదని విమర్శించారు.