Hemant Soren: నన్ను అవమానించారు.. ఈడీ అధికారులపై పోలీసులకు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్ ఫిర్యాదు
- ఎస్టీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు పెట్టాలని విజ్ఞప్తి
- నోటీసులు ఇవ్వకుండానే అధికారులు సోదాలు నిర్వహించారని ఆరోపణ
- తనను అవమాన పరిచేందుకు మీడియాకు అధికారులు లీకులిచ్చారని ఫిర్యాదు
మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పోలీసులను ఆశ్రయించారు. తనను విచారించిన ఈడీ అధికారులపై ఎస్టీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని కోరారు. జనవరి 29న న్యూఢిల్లీలో ఈడీ అధికారులు తన నివాసంలో సోదాలు నిర్వహించిన వైనాన్ని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, తను లేని సమయంలో సోదాలు చేపట్టారని ఫిర్యాదు చేశారు. తన ఇంటి పరిసరాల్లో బ్లూ బీఎమ్‌డబ్లూ కారు, పెద్ద ఎత్తున అక్రమ నగదు లభించాయంటూ అధికారులు మీడియాకు లీకులు ఇచ్చారని పేర్కొన్నారు. ఆ కారు తనది కాదని, తన వద్ద ఎలాంటి నగదు లేదని చెప్పారు. ప్రజల ముందు తనను అవమానించేందుకు ఈడీ ఈ చర్యలు తీసుకుందని ఆరోపించారు. ఈడీ అధికారుల కారణంగా తను, తన కుటుంబం మానసిక వేదన అనుభవించిందన్న ఆయన సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
కాగా, బుధవారం కూడా ఈడీ అధికారులు హేమంత్ సోరెన్‌ను రాంచీలోని ఆయన నివాసంలో విచారించారు. ఈడీ అధికారులు ఆయనను విచారించడం ఇది రెండోసారి. ఈ కేసుకు సంబంధించి జనవరి 20న కూడా అధికారులు ఆయనను ప్రశ్నించారు.
ఏమిటీ మనీలాండరింగ్ కేసు
ఝార్ఖండ్‌లో చట్టవ్యతిరేకంగా బారీ ఎత్తున భూమి చేతులు మారిందన్న ఆరోపణలపై విచారణ చేపడుతున్న ఈడీ అధికారులు ఈ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కోణంలో ఝార్ఖండ్ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారు. కాగా, సోమవారం న్యూఢిల్లీలో హేమంత్ సోరెన్ నివాసంలో జరిపిన సోదాల్లో రూ.36 లక్షల విలువైన ఎస్‌యూవీ, ఆయన పాత్ర ఉందని సూచించే కొన్ని డాక్యుమెంట్లు లభ్యమైనట్టు అధికారులు తెలిపారు. అయితే, రాజకీయ లక్ష్యాలతోనే ఈ విచారణ జరుగుతోందని హేమంత్ సోరెన్ మండిపడ్డారు. ఝార్ఖండ్‌లో పాలనకు అడ్డుపడాలన్న లక్ష్యంతో ఇదంతా జరుగుతోందని ఆరోపించారు.