KTR: పదవికి మాత్రమే విరమణ... ప్రజాసేవకు కాదు: తెలంగాణ సర్పంచ్ల పదవీ విరమణ సందర్భంగా కేటీఆర్
- పదవీ విరమణ చేస్తోన్న తెలంగాణ రాష్ట్ర సర్పంచ్లకు కృతజ్ఞతాభివందనాలు తెలిపిన కేటీఆర్
- అయిదేళ్ల కాలంలో ప్రజలకు ఇతోధికంగా సేవ చేసిన సర్పంచ్లు అంటూ పేర్కొన్న కేటీఆర్
- సర్పంచ్లు పదవీ విరమణ చేసినప్పటికీ మరింతకాలం ప్రజాసేవలో ఉండాలని ఆశిస్తున్నానని పేర్కొన్న కేటీఆర్
పదవీ విరమణ చేస్తోన్న తెలంగాణ రాష్ట్ర సర్పంచ్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృతజ్ఞతలు... అభినందనలు తెలిపారు. నిన్నటితో సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. అయితే ప్రత్యేక కార్యదర్శులను నియమించడమా? లేక సర్పంచ్ల పదవీ కాలాన్ని పొడిగించడమా? లేక తక్షణమే ఎన్నికలు నిర్వహించడమా? నిర్ణయించాల్సి ఉంది. ఈ క్రమంలో కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
"అయిదేళ్ల కాలం తెలంగాణ ప్రజానీకానికి ఇతోధికంగా సేవచేసిన గ్రామ సర్పంచ్లు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా వారికి కృతజ్ఞతాభివందనాలు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ గ్రామాల్లో నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠ ధామాలు నెలకొల్పడంలో, దేశానికి ఆదర్శంగా నిలిపిన కృషిలో మీ పాత్ర ఎనలేనిది. మీరు మరింతకాలం ప్రజాసేవలో ఉండాలని ఆశిస్తూ" అంటూ ట్వీట్ చేశారు. సర్పంచ్ పదవికి కేవలం విరమణ మాత్రమేనని... ప్రజాసేవకు కాదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఒక ఊరు... అనేక పథకాలు అంటూ బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని వెల్లడించేలా ఉన్న ఓ ఫొటోను షేర్ చేశారు. ఇందులో వైకుంఠధామం, డంప్ యార్డ్, ప్రకృతి వనం, మిషన్ భగీరథ ట్యాంకు, విశాలమైన రోడ్లు, డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయం, మిషన్ కాకతీయ చెరువు, హరితహారం వంటి పథకాలను పేర్కొన్నారు.