Railway Jone: ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా సమావేశం... జోన్ నిర్మాణానికి ఏపీ భూమి ఇవ్వలేదని వెల్లడి
- రైల్వే బడ్జెట్ లో ఏపీ ప్రస్తావనలు తెచ్చిన మంత్రి అశ్విని వైష్ణవ్
- ఏపీలో రైల్వే జోన్ కోసం 53 ఎకరాలు ఇవ్వాల్సి ఉందని వెల్లడి
- భూమి అప్పగిస్తే పనులు ప్రారంభించేందుకు తాము సిద్ధమని స్పష్టీకరణ
- రైల్వే జోన్ కోసం డీపీఆర్ కూడా సిద్ధమైందని వివరణ
ఇవాళ కేంద్ర బడ్జెట్ ప్రకటించిన నేపథ్యంలో, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీలో రైల్వే జోన్ అంశాన్ని ప్రస్తావించారు.
రైల్వే జోన్ నిర్మాణానికి ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం భూమి అప్పగించలేదని తెలిపారు. జోన్ కోసం 53 ఎకరాలు ఇవ్వాల్సి ఉందని, ఏపీ ప్రభుత్వం భూమిని కేటాయిస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. జోన్ ఏర్పాటు కోసం డీపీఆర్ కూడా సిద్ధమైందని అన్నారు.
ప్రస్తుత బడ్జెట్ లో ఏపీకి రూ.9,138 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రూ.886 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంతో పోల్చితే ప్రస్తుతం ఏపీకి పది రెట్లు అధికంగా బడ్జెట్ కేటాయింపులు జరిగినట్టు స్పష్టం చేశారు.
ఏపీలో 97 శాతం రైల్వే లైన్లు విద్యుద్దీకరణ చేసినట్టు వివరించారు. ఏపీలో రైల్వేల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.68,059 ఖర్చు చేస్తోందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఏపీలో 72 రైల్వే స్టేషన్లను 'అమృత్' స్థాయి స్టేషన్లుగా ఆధునికీకరిస్తున్నట్టు తెలిపారు.
2014 నుంచి 7,009 ఫ్లైఓవర్ లు, అండర్ పాస్ లు నిర్మించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏడాదికి 240 కిలోమీటర్ల మేర ట్రాక్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.