Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో న్యూడెవలప్‌మెంట్ బ్యాంకు డైరెక్టర్ జనరల్ పాండియన్ భేటీ.. తెలంగాణ అభివృద్ధికి అండగా ఉంటామని హామీ!
- మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును చేపడతామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- మెట్రో రైలు రెండో దశ సహా వివిధ ప్రాజెక్టులకు సహకరించాలన్న ముఖ్యమంత్రి
- తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన పాండియన్
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును చేపడతామని... మూసీ రివర్ ఫ్రంట్ ఏరియాను అంతర్జాతీయస్థాయిలో నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూడెవలప్‌మెంట్ బ్యాంక్ డైరెక్టర్ జనరల్ డా.డి.జె.పాండియన్ గురువారం డా.బి.ఆర్.అంబెడ్కర్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మూసీ రివర్ ఫ్రంట్ ఏరియాను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేశామన్నారు. నదిని సంరక్షిస్తూ, నదీ జలాలను సుస్థిరంగా ఉంచటం... దీని ద్వారా స్థానికులకు ఎక్కువ ప్రయోజనం కలిగే విధంగా... ఈ ప్రాజెక్టును మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దే విధంగా పనులు చేపడతామన్నారు. అలాగే మూసీ నది అభివృద్ధిలో పర్యావరణాన్ని కాపాడుతూ, కాలుష్యరహితంగా, సహజ వనరులకు విఘాతం కలగకుండా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. వీటికి సహకరించాలని పాండియన్‌ను కోరారు.
హైదరాబాద్‌లో రెండో దశలో చేపట్టే మెట్రో రైల్ ప్రాజెక్ట్‌కు, తెలంగాణలో శిక్షణ, సాంకేతిక నైపుణ్యాలు అందించే శిక్షణ సంస్థలు ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అలాగే ఆసుపత్రుల నిర్మాణాలకు, విద్యాసంస్థల హాస్టల్ భవనాల నిర్మాణానికి, ప్రభుత్వం చేపట్టే గృహ నిర్మాణాలకు... అలాగే వేస్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందించాలన్నారు. ఈ సందర్భంగా పాండియన్ మాట్లాడుతూ.... రాష్ట్ర పురోభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.