Ganta Srinivasa Rao: విశాఖ రైల్వే జోన్ కోసం 53 ఎకరాల స్థలం దొరకలేదా?... సిగ్గుపడాలి జగన్ గారూ!: గంటా
- నేడు బడ్జెట్ ప్రకటించిన కేంద్రం
- విశాఖ రైల్వే జోన్ పై స్పందించిన రైల్వే శాఖ మంత్రి
- ఏపీ ప్రభుత్వం కారణంగానే జోన్ ఆలస్యం అవుతోందని వెల్లడి
- 53 ఎకరాల స్థలం ఇస్తే పనులు వెంటనే ప్రారంభిస్తామన్న అశ్విని వైష్ణవ్
- సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన గంటా శ్రీనివాసరావు
కేంద్ర బడ్జెట్ ప్రకటన నేపథ్యంలో, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ఏపీలో రైల్వే జోన్ ఏర్పాటుకు తాము సిద్ధంగానే ఉన్నా, 53 ఎకరాల స్థలం కేటాయించకుండా ఏపీ ప్రభుత్వమే జాప్యం చేస్తోందని ఆరోపించారు.
దీనిపై టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు. సిగ్గుపడాలి జగన్ గారూ... కబ్జాల గుప్పిట్లో విశాఖ భూమాతను బందీ చేసి, రైల్వే జోన్ కోసం 53 ఎకరాల భూమిని ఇవ్వలేకపోయారు అంటూ ధ్వజమెత్తారు.
"రాష్ట్ర చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో విశాఖలో భూ దోపిడీకి పాల్పడ్డారు. లక్షల కోట్ల విలువైన వేల ఎకరాల భూములను మీరు, మీ సామంత రాజులు దోచుకున్నారు. కానీ, విశాఖ రైల్వే జోన్ కోసం మాత్రం 53 ఎకరాల స్థలం దొరకలేదా? విశాఖలో మీ విలాస రాజభవనాల కోసం వందల కోట్లతో కట్టుకున్న రాజకోటకు మాత్రం భూమి దొరుకుతుంది... కానీ రైల్వే జోన్ కోసం మాత్రం భూమి దొరకలేదా?
ఈ ఐదేళ్లలో మీరు, మీ నాయకులు విశాఖలో ఎవరెవరు ఎంతెంత దోచుకున్నారో, దాచుకున్నారో లెక్కలతో సహా చెప్పడానికి మేం సిద్ధం. విశాఖ రైల్వే జోన్ కోసం 53 ఎకరాల భూమిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగామని, ఏపీ ప్రభుత్వం ఇంకా భూమిని అప్పగించలేదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు. జోన్ ఏర్పాటు కోసం డీపీఆర్ కూడా సిద్ధమైంది... రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు భూమి ఇస్తే అప్పుడు పనులు మొదలు పెడతామని అశ్విని వైష్ణవ్ గారు క్లియర్ గా చెబుతున్నారు. విశాఖకు రైల్వే జోన్ రాకపోవడానికి కారణం మీరేనని కేంద్రం స్పష్టంగా చెబుతోంది.
ఇప్పటికైనా కళ్లు తెరవండి జగన్ గారూ. రైల్వే జోన్ అనేది ఉత్తరాంధ్ర ప్రజల మూడు దశాబ్దాల కల. మీరు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు. విశాఖలో మీరు దోచుకోవడంపై పెట్టిన శ్రద్ధ... అభివృద్ధిపై పెట్టి ఉంటే ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల రైల్వే జోన్ ఎప్పుడో వచ్చి ఉండేది.
విశాఖ రైల్వే జోన్ కోసం 53 ఎకరాల స్థలం ఇవ్వకుండా, రైల్వే జోన్ రాకుండా ఉండడానికి కారణమైన మీరు... వచ్చే ఎన్నికలకు మీరు సిద్ధమా అని ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారు?
చరిత్రలో మీరు విశాఖ ద్రోహిగా మిగిలిపోయారు. విశాఖను వైసీపీ విముక్త ప్రాంతంగా చేసుకునేందుకు ఇప్పటికే విశాఖ ప్రజలు సిద్ధమైపోయారు. రాబోయే ఎన్నికల్లో మీ ప్రభుత్వ పతనం ఇదే విశాఖ నుంచే ప్రారంభం అవుతుందని గుర్తుంచుకోండి" అంటూ గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు.