Indian American Doctor Clean Chit: అమెరికా విమానంలో అసభ్యకర చర్యల ఆరోపణలు.. భారతీయ వైద్యుడికి క్లీన్ చిట్
- 2022 మేలో హవాయ్ నుంచి బోస్టన్ వస్తున్న విమానంలో ఘటన
- పక్క సీటులో కూర్చున్న భారతీయ వైద్యుడు అసభ్యకర చర్యకు పాల్పడ్డాడంటూ మైనర్ బాలిక ఆరోపణ
- వైద్యుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తాజాగా తీర్పు
- పీడకల ముగిసినందుకు భారతీయ వైద్యుడి హర్షం
విమానంలో 14 ఏళ్ల బాలిక పక్కన కూర్చుని అసభ్యకర చర్యకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ వైద్యుడికి ఊరట లభించింది. 2022 నాటి కేసులో కోర్టు బుధవారం డా. సుదీప్తా మొహంతీని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.
అసలేం జరిగింది..
డా. సుదీప్తా మొహంతీ బోస్టన్లోని బెత్ ఇజ్రాయెల్ డీకన్నెస్ మెడికల్ సెంటర్లో ప్రైమరీ కేర్ వైద్యుడిగా పనిచేస్తున్నారు. 2022 మే నెలలో ఆయన హవాయ్ అమెరికన్ ఫ్లైట్‌లో బోస్టన్ నుంచి అమెరికా వస్తున్న సమయంలో పక్క సీటులోని మైనర్ బాలిక వైద్యుడిపై సంచలన ఆరోపణలు చేసింది. ఒంటిపై దుప్పటి కప్పుకుని అతడు అసభ్యకర చర్యకు పాల్పడినట్టు ఆరోపించింది. దుప్పటి తొలగినప్పుడు అతడి చర్య చూసి తనకు జుగుప్స కలిగిందని చెప్పుకొచ్చింది. సుదీప్తా పక్కన కూర్చోలేక తాను మరో సీటుకు మారిపోయానని వెల్లడించింది. విమానం దిగాక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా, కేసు విచారణ కోసం సుదీప్తా బెంచ్ ట్రయల్‌ను (జ్యూరీకి బదులు న్యాయమూర్తి విచారణ చేపడతారు) ఎంచుకున్నారు. తానేమీ తప్పు చేయలేదని కోర్టులో వాదించారు. విమానంలో తనకు కాబోయే భార్య కూడా తన పక్కనే కూర్చుని ప్రయాణించిందని చెప్పుకొచ్చారు. ఇలా ఎందుకు జరిగిందో తమకు అస్సలు అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, విమానంలోని ఇతర ప్రయాణికులు, క్రూ సిబ్బంది కూడా సుదీప్తాకు మద్దతుగా నిలిచారు. తమకు అతడి తీరు అనుమానాస్పదంగా కనిపించలేదని అన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి చివరకు సుదీప్తాను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించారు.
కోర్టు తీర్పుపై సుదీప్తా తరపు న్యాయవాది హర్షం వ్యక్తం చేశారు. తన క్లైంట్ చరిత్ర మచ్చలేనిదని పేర్కొన్నారు. ఈ పీడకల ఎట్టకేలకు ముగిసిందని వ్యాఖ్యానించారు. అయితే, తీర్పు తమను నిరాశపరిచిందని ప్రాసిక్యూషన్ (బాలిక తరపున వాదిస్తున్న ప్రభుత్వ న్యాయవాది) వ్యాఖ్యానించింది. బాధితులు న్యాయం కోసం ధైర్యంగా ముందుకు రావాలని సూచించింది. వారికి తాము ఎప్పుడూ అండగా నిలబడతామని భరోసా ఇచ్చింది.