Paytm Payments Bank: మీ డబ్బు భద్రంగా ఉంది.. కస్టమర్లకు పేటీఎం భరోసా

Your Money Is Safe Paytm Payments Bank To Customers After RBI Curbs

  • పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సేవలపై ఆర్బీఐ ఆంక్షలు
  • మార్చ్ నుంచీ కొత్త కస్టమర్ల స్వీకరణ, నగదు బదిలీ, క్రెడిట్ ట్రాన్సాక్షన్లను నిలిపివేయాలని ఆదేశం
  • ఆందోళనలో ఉన్న కస్టమర్లకు సంస్థ భరోసా
  • డబ్బులు ఎప్పుడు కావాలన్నా విత్‌డ్రా చేసుకోవచ్చని స్పష్టీకరణ

ఆర్బీఐ ఆంక్షలతో ఆందోళనలో ఉన్న పేటీఎం పేమెంట్ బ్యాంక్ కస్టమర్లకు సంస్థ యాజమాన్యం తాజాగా భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. కస్టమర్ల డబ్బు తమ వద్ద భద్రంగా ఉందంటూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పేటీఎం పేమెంట్ బ్యాంకు నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆర్బీఐ గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చ్ నెల నుంచి కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని పేటీఎం పేమెంట్స్ బ్యాంకును ఆర్బీఐ ఆదేశించింది. నగదు బదిలీ సేవలు, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్‌ను కూడా నిలిపివేయాలని పేర్కొంది. 

ఈ నేపథ్యంలో కస్టమర్ల సందేహాలను నివృత్తి చేసేందుకు సంస్థ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 29 తరువాత కస్టమర్లు తమ అకౌంట్లు, వాలెట్లలో డబ్బులు జమ చేసేందుకు అనుమతి ఉండదని పేర్కొంది. అయితే, కస్టమర్లు ఎప్పటిలాగే డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కస్టమర్ల డబ్బు తమ వద్ద భద్రంగా ఉందని, ఏ సహాయం కావాలన్నా తాము 24 గంటలు అందుబాటులో ఉంటామని పేర్కొంది. 

కొన్నాళ్లుగా నష్టాలు చవిచూస్తున్న పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకుకు ఆర్బీఐ ఆదేశాలు శరాఘాతంగా మారాయి. ఆర్బీఐ ఆంక్షల తరువాత కంపెనీ షేర్ల విలువ దాదాపు 20 శాతం పతనమైంది. మార్కెట్ విలువలో ఏకంగా 1.2 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ పరిణామంతో సంస్థ వార్షిక ఆదాయంపై రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడొచ్చని పేటీఎం అంచనా వేస్తోంది. ఆర్బీఐ ఆదేశాల మేరకు తక్షణ చర్యలు చేపడుతున్నామని కూడా వెల్లడించింది. త్వరలో లాభాల బాట పడతామని ఆశాభావం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News