Madhusudhan Yadav: పార్టీ మార్పు వార్తలపై వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ స్పందన
- కనిగిరి వైసీపీ ఇన్ఛార్జీగా దద్దాల నారాయణ యాదవ్ నియామకం
- ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ పార్టీకి రాజీనామా చేస్తారని ప్రచారం
- తాను ఎప్పటికీ వైసీపీలోనే కొనసాగుతానన్న మధుసూదన్
కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జీగా దద్దాల నారాయణ యాదవ్ ను వైసీపీ హైకమాండ్ నియమించింది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ తీవ్ర అసంతృప్తి చెందుతున్నారని, పార్టీని వీడేందుకు ఆయన సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మధుసూదన్ యాదవ్ స్పందిస్తూ... ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఒకలాగ, ఇవ్వకపోతే మరోలా ఉండనని చెప్పారు. తమ అధినేత జగన్ తో తనది ఒక ప్రత్యేకమైన అనుబంధమని... దాన్ని ఎవరూ విడదీయలేరని అన్నారు. నారాయణ యాదవ్ కు అన్ని విధాలా సహకరిస్తానని చెప్పారు.
తనకు ఇద్దరు దేవుళ్లని... ఒకరు జగన్, మరొకరు వేంకటేశ్వరస్వామి అని మధుసూదన్ యాదవ్ తెలిపారు. తన రాజకీయ దేవుడు జగన్ ఏది చెపితే అది చేస్తానని అన్నారు. టీటీడీలో సభ్యుడిగా కూడా జగన్ తనకు అవకాశం కల్పించారని చెప్పారు. అందరం కలిసి వైసీపీ గెలుపు కోసం పని చేస్తామని అన్నారు.
తాను పార్టీకి రాజీనామా చేస్తానని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. తాను ఎప్పటికీ వైసీపీలోనే కొనసాగుతానని అన్నారు. జగన్ ను కాదని తాను ఎక్కడికీ వెళ్లనని చెప్పారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు జగన్ రెండు సార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారని... ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు.