Varla Ramaiah: ఆ కంగారులో జగన్ ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆయనకే తెలియడంలేదు: వర్ల రామయ్య
- జగన్ రూ.43 వేల కోట్లు కొట్టేసినట్టు సీబీఐ చెప్పకనే చెప్పిందన్న వర్ల రామయ్య
- జగన్ లో కలవరం మొదలైందని కామెంట్
- జగన్ ఆస్తులు బినామీల పేరు మీద ఉన్నాయని ఆరోపణ
- బినామీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. జగన్ రూ.43 వేల కోట్లు కొట్టేసినట్టు సీబీఐ చెప్పకనే చెప్పిందని పేర్కొన్నారు. కొద్దికాలంలోనే జగన్ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా మారారని తెలిపారు.
తన మీద ఉన్న కేసుల విచారణ ముప్పు ముంచుకొస్తుంటే సీఎం జగన్ లో కలవరం మొదలైందని అన్నారు. కేసుల భయంతో వణికిపోతున్న జగన్, ఆ కంగారులో ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆయనకే తెలియడంలేదని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.
జగన్ ఆస్తులన్నీ బినామీల పేరు మీదనే ఉన్నాయని, ఆయనపై బినామీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తాడేపల్లి నివాసం, బెంగళూరు ప్యాలెస్ కూడా బినామీల పేరుపైనే ఉన్నాయని వివరించారు. కేప్ స్టోన్ ఇన్ ఫ్రా, హరీశ్ ఇన్ ఫ్రా, ఇథోపియా ఇన్ ఫ్రా వంటివి జగన్ బినామీ కంపెనీలు అని వర్ల రామయ్య ఆరోపించారు.