bharat rice: వచ్చే వారం నుంచి రిటైల్ మార్కెట్‌లో రూ.29కే భారత్ రైస్

Govt to sell Bharat Rice in retail market at rs 29 a kg

  • సబ్సిడీతో కూడిన బియ్యంను రిటైల్ మార్కెట్‌లో అందుబాటులోకి తెస్తున్నామన్న కేంద్రం
  • నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్, రిటైల్ చైన్ కేంద్రీయ బండార్‌ ద్వారా అందుబాటులోకి బియ్యం 
  • భారత్ రైస్ 5 కిలోలు, 10 కిలోల ప్యాక్స్ అందుబాటులో ఉంటాయన్న సంజీవ్ చోప్రా

సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారత్ రైస్‌ పేరిట కిలో రూ.29కే బియ్యాన్ని వచ్చే వారం నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ధరలను నియంత్రించేందుకు... ట్రేడర్లు తమ బియ్యం స్టాక్‌ను వెల్లడించాలని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఆదేశించింది. 

వివిధ రకాలపై ఎగుమతి పరిమితులు ఉన్నప్పటికీ, బియ్యం రిటైల్ ధరలు సంవత్సరానికి 13.8 శాతం, టోకు ధరలు 15.7 శాతం పెరిగాయని తెలిపింది. ధరలను నియంత్రించడానికి, ఆహార ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ధోరణులను గుర్తించేందుకు, వచ్చే వారం నుండి రిటైల్ మార్కెట్‌లో సబ్సిడీతో కూడిన భారత్ రైస్‌ను కిలో రూ.29 చొప్పున విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు.

నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF), రిటైల్ చైన్ కేంద్రీయ భండార్‌ ద్వారా భారత్ రైస్ 5 కిలోలు, 10 కిలోల ప్యాక్‌లు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపింది. మొదటి దశలో, ప్రభుత్వం రిటైల్ మార్కెట్‌లో అమ్మకానికి 500,000 టన్నుల బియ్యాన్ని కేటాయించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భారత్ ఆటాను కిలో రూ.27.50... భారత్ చనా దాల్‌ను రూ.కిలో రూ.60కి విక్రయిస్తోంది.

తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వ్యాపారులు, హోల్‌సేలర్లు, రిటైలర్లు, బిగ్ చైన్ రిటైలర్లు, ప్రాసెసర్లు లేదా మిల్లర్లు ఆహార ధాన్యాల స్టాక్ పొజిషన్‌ను తప్పనిసరిగా ప్రకటించాలని చోప్రా స్పష్టం చేశారు. అన్ని బియ్యం కేటగిరీల స్టాక్ పొజిషన్ - బ్రోకెన్ రైస్, నాన్ బాస్మతీ వైట్ రైస్, పార్బాయిల్డ్ రైస్, బాస్మతి రైస్, వరి వివరాలను ప్రతి వారం ఆహార,  ప్రజా పంపిణీ శాఖ పోర్టల్‌లో ప్రకటించాల్సి ఉంటుందని తెలిపారు.

దేశీయంగా ధరలు స్థిరపడే వరకు బియ్యం ఎగుమతులపై ఆంక్షలను ఎత్తివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని చోప్రా స్పష్టం చేశారు. స్టాక్ పరిమితి లేదని... కానీ ధరలు తగ్గించి సామాన్యులపై భారం తగ్గించేందుకు అన్ని అవకాశాలు వినియోగించుకుంటామన్నారు. బియ్యం మినహా మిగతా అన్ని ఆహార ఉత్పత్తుల ధరలు నియంత్రణలోనే ఉన్నాయని తెలిపారు.

  • Loading...

More Telugu News