Jagan: నా ఐదేళ్ల పాలన చూడండి, చంద్రబాబు పాలన చూడండి!: సీఎం జగన్

CM Jagan explains what he done in five years
  • నేడు దెందులూరులో వైసీపీ సిద్ధం సభ
  • తన పాలనను ప్రజలకు వివరించిన సీఎం జగన్
  • తాను అందించిన సంక్షేమం ఇదీ అంటూ స్పష్టం చేసిన జగన్
  • చంద్రబాబు పాలనలో ఒక్క రూపాయి అయినా ఖాతాలో పడిందా అంటూ విమర్శలు 
దెందులూరులో సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ... తన పాలన చూసి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ బిడ్డ జగన్ హయాంలో జరుగుతున్న ఈ 57 నెలల పాలనకు, గతంలో చంద్రబాబు పాలనకు తేడా చూడాలని అన్నారు. ఎవరి పాలనలో ప్రజల ఖాతాల్లోకి ఎక్కువ డబ్బు పడిందో వైసీపీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి అడగాలని సూచించారు. 

అక్కచెల్లెమ్మల ఖాతాలో చంద్రబాబు ఒక్క రూపాయి అయినా వేశాడా?చంద్రబాబు మేనిఫెస్టోలో 10 శాతం అయినా హామీలు నెరవేర్చాడా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. 

"కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు... మీ ఇష్టం వచ్చిన ఏ గ్రామం అయినా తీసుకోండి... ఏ పట్టణం అయినా తీసుకోండి... గతంలో లేని విధంగా ఇవాళ ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది, ఒక వార్డు సచివాలయం కనిపిస్తుంది. ఈ వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారు అంటే... మీ జగన్, మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. 

1వ తేదీ ఉదయాన్నే మన ఇంటికి వచ్చి, చిక్కటి చిరునవ్వులతో తలుపుతట్టి... ప్రతి అవ్వ, తాతకు ఒక మంచి మనవడిలా... ఒక మంచి మనవరాలిలా... ప్రతి వితంతువుకు, ప్రతి దివ్యాంగుడికి... ఇలా 66 లక్షల కుటుంబాలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి చేతుల్లో వాలంటీర్లు రూ.3 వేల పెన్షన్ పెడుతున్నప్పుడు గుర్తుకువచ్చేది ఎవరు... మీ జగన్, మన వైస్సార్సీపీ. 

నాడు జన్మభూమి కమిటీలు లంచాలు, వివక్షకు మారుపేరులా నిలిచాయి. అలాంటి రోజుల నుంచి, ఇవాళ గ్రామాల్లో ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా... సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఎవరు తెచ్చారు అంటే... మీ జగన్, మన వైఎస్సార్సీపీ. డీబీటీ ద్వారా బటన్ నొక్కి ఎలాంటి లంచాలు లేకుండా నేరుగా మా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పంపుతోంది ఎవరు అంటే... మీ జగన్, మన వైస్సార్సీపీ.

ఇవాళ ప్రభుత్వాసుపత్రులు, స్కూళ్లను నాడు-నేడు కింద అభివృద్ధి చేసింది ఎవరు అంటే... మీ జగన్, మన వైఎస్సార్సీపీ. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే స్కూళ్లు, ఆసుపత్రుల రూపురేఖలు మారాయి. ఇవాళ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం వచ్చిందీ అంటే, ఇవాళ చిన్నారుల చేతుల్లో ట్యాబ్ లు కనిపిస్తున్నాయంటే, ఆ స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూంలు కనిపిస్తున్నాయంటే గుర్తుకువచ్చేది... మీ జగన్, మన వైఎస్సార్సీపీ. 

రాష్ట్రంలో రైతన్నల చేయిపట్టుకుని నడిపించే ఆర్బీకేలు తీసుకువచ్చింది, రైతన్నకు రైతు భరోసా సొమ్ము అందిస్తున్నది ఎవరు అంటే... మీ జగన్... ఎప్పటి నుంచి ఈ సంక్షేమం జరుగుతున్నదీ అంటే... మన వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచే. 

పేదలకు, రైతన్నలకు మంచి చేస్తూ... అసైన్డ్ భూముల మీదా, 22ఏ భూముల మీదా ఏకంగా 35 లక్షల ఎకరాల మీద శాశ్వత భూహక్కులు ఇచ్చింది ఎవరూ అంటే... మీ జగన్... జరిగింది ఎప్పుడూ అంటే... వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. 

నా ఎస్సీలు, నా మైనారిటీలు, నా బీసీలు అంటూ ఈ 57 నెలల పాలనలో రూ.2.55 లక్షల కోట్లను అందించి త్రికరణ శుద్ధిగా ప్రేమ, ఆప్యాయత, అభిమానం చూపింది ఎవరూ అంటే... మీ జగన్!.. ఈ మంచి జరిగింది ఎప్పుడూ అంటే... మన వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే. 

చట్టం చేసి మరీ ఈ వర్గాలకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చింది ఎవరూ అంటే... ఈ జగన్... జరిగింది ఎప్పుడూ అంటే... మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. క్యాబినెట్ లో 68 శాతం మంత్రి పదవులు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని పిలుచుకునే నా అక్కచెల్లెమ్మలు, నా అన్నదమ్ములకు దక్కింది ఎప్పుడూ అంటే... మీ బిడ్డ పాలనలో, మన వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాకే" అంటూ సీఎం జగన్ తన ఐదేళ్ల పాలనను వివరించారు.
Jagan
Siddham
Denduluru
YSRCP
Andhra Pradesh

More Telugu News