Chandrababu: ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడు: చంద్రబాబు

Chandrababu criticised CM Jagan and releases Charge Sheet
  • రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
  • చంద్రబాబు నివాసంలో టీడీఎల్పీ సమావేశం
  • హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • 'ప్రజాకోర్టు' పేరిట చార్జిషీటు విడుదల 
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సన్నద్ధం చేసేందుకు పార్టీ  అధినేత చంద్రబాబునాయుడు నేడు తన నివాసంలో టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, సభా సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. అంతేకాదు... జగన్ ఎన్నికల హామీల పేరుతో మోసాలకు పాల్పడ్డారంటూ ‘ప్రజాకోర్టు’ పేరుతో ఛార్జ్ షీట్ విడుదల చేశారు.  

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం చెపుతున్న 99 శాతం హామీల అమలు అనేది అతి పెద్ద బూటకం అని అన్నారు. అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను వంచిస్తున్న జగన్ కు ప్రజాకోర్టులో శిక్ష పడడం ఖాయం అని, అతి పెద్ద ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని స్పష్టం చేశారు. 

ఎన్నికల ముందు ఊరూరా తిరిగి అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ నేడు ప్రజలను నిట్టనిలువునా మోసం చేశాడని దుయ్యబట్టారు. మేనిఫెస్టో, పాదయాత్రలో మొత్తం 730 హామీలు ఇచ్చారని, వాటిలో 21 శాతం కూడా అమలు చేయకుండా 99 శాతం అమలు చేశానంటూ ప్రజల్ని వంచిస్తున్నాడని ధ్వజమెత్తారు. మోసపూరిత మాటలతో ప్రజలను మోసం చేస్తున్న జగన్ కు మరో రెండు నెలల్లో ప్రజాకోర్టులో శిక్ష తప్పదని చంద్రబాబు పేర్కొన్నారు. 

‘‘విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి మాట తప్పి, మడమ తిప్పి రూ.64 వేల కోట్ల భారం మోపాడు. మద్య నిషేధం హామీని అటకెక్కించి మద్యం అమ్మకాలపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లు అప్పులు తెచ్చాడు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీ గాలికొదిలేశాడు. నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు, ఛార్జీలతో ఒక్కో కుటుంబంపై రూ.8 లక్షల భారం మోపాడు. 

పెట్రోల్ డీజిల్ ధరలపై మాట తప్పి.. జనం జేబులు కొల్లగొడుతున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు హామీపై మాట తప్పాడు. తెలియక హామీ ఇచ్చానంటూ తప్పించుకున్నాడు. మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధిస్తానన్న హామీపై మాటే మాట్లాడడం లేదు. జలయజ్ఞం అంటూ ఆర్భాటంగా ప్రకటించి, ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. ఏటా జనవరి 1న ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ హామీ ఏమైందో తెలియదు. 

సొంత జిల్లాలో ఏర్పాటు చేస్తానన్న స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై నాలుక మడతేశాడు. పోలీసులకు వీక్లీ ఆఫ్ హామీ గాలికొదిలేశాడు. ఇలా ఒక్కటని కాదు... తాను ఇచ్చిన ఏ హామీ కూడా జగన్ అమలు చేయలేదు ?’’ అని చంద్రబాబు దుయ్యబట్టారు. 

ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Chandrababu
Jagan
Charge Sheet
TDLP
TDP
YSRCP

More Telugu News